ప్రతి జిల్లా కేంద్రంలో హెల్త్ హబ్…
వైద్యం కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనుండదన్న సీఎం జగన్
- కొవిడ్ కట్టడి చర్యలపై సీఎం జగన్ సమీక్ష
- వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళుతున్నారని వెల్లడి
- ఎందుకు వెళుతున్నారో ఆలోచించాలన్న సీఎం జగన్
- ఏపీలో 16 చోట్ల హెల్త్ హబ్ లకు నిర్ణయం
ఏపీలో కరోనా కట్టడి చర్యలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యం కోసం ప్రజలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై తరలి వెళుతున్నారని వెల్లడించారు. వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళుతున్నారో ఆలోచించాలని అధికారులకు నిర్దేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని, జిల్లా ప్రధాన కేంద్రాల్లో హెల్త్ హబ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కనీసం 16 హెల్త్ హబ్ లు ఉండాలని అన్నారు.
ఒక్కో హెల్త్ హబ్ కోసం ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాల స్థలం సేకరించాలని స్పష్టం చేశారు. ఒక హెల్త్ హబ్ లో ఒక్కో ఆసుపత్రికి 5 ఎకరాల చొప్పున కేటాయించాలని సూచించారు. మూడేళ్లలో కనీసం రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టే ఆసుపత్రులకు భూములు కేటాయించాలని తెలిపారు. ఆ విధంగా రాష్ట్రంలో కనీసం 80 మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రైవేటు రంగంలో మంచి ఆసుపత్రులు వస్తాయని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి జిల్లా కేంద్రంలో, కార్పొరేషన్ల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయని వివరించారు. తద్వారా వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఆయా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు మంచి ప్రమాణాలతో కూడిన వైద్యం లభిస్తుందని పేర్కొన్నారు. నెల రోజుల్లో దీనికి సంబంధించిన విధివిధానాలను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రభుత్వం తరఫున మరో 16 వైద్య, నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయని వెల్లడించారు.