- ముదినేపల్లిలో పవన్ సభ
- జనసేన, టీడీపీ పదేళ్లు కలిసి పనిచేయాల్సి ఉందని వెల్లడి
- 2014లో జనసేన, టీడీపీ మధ్య మాట మాట పెరిగి విడిపోయినట్టు వివరణ
- ఇప్పుడు రాష్ట్రం కోసం కలిసి వెళుతున్నామని ఉద్ఘాటన
జనసేన, టీడీపీ కలిసి పదేళ్లు పనిచేయాల్సి ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ముదినేపల్లిలో వారాహి విజయ యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడంతో శ్రీకాకుళంలో తనను ప్రజలు ప్రశ్నించారని, దాంతో పొత్తు నుంచి బయటికి వచ్చానని పవన్ వెల్లడించారు. ఆ తర్వాత మాట మాట అనుకున్నామని, విడిపోయామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రం కోసం కలిసి వెళుతున్నామని వెల్లడించారు.
“టీడీపీ నేతలు అర్థం చేసుకోవాలి. మేం మీకు స్నేహ హస్తం అందించాం. మీరు కూడా అదే విధంగా మా వాళ్లతో స్నేహంగా ఉండండి. గతంలో గొడవలు పక్కనబెట్టండి. చంద్రబాబుతో విభేదాలు ఉన్నప్పటికీ నేను రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయనను కలిశాను.
2014లో నేను టీడీపీకి అండగా నిలిచినప్పుడు, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ రోజూ కూడా నా వల్లనే గెలిచింది అని చెప్పలేదు. నేను అన్నది ఏంటంటే… మేం మద్దతు ఇచ్చాం, ఏం ఆశించలేదు… ఒక్క ఓటు మా వల్ల పడినా దానికి కృతజ్ఞత అనేది ఉండాలని చెప్పాను” అని పవన్ వివరించారు.
ముఖ్యమంత్రి పదవిపై ముదినేపల్లిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్

. వైసీపీ నేతల దృష్టిలో ఎవరూ ఎవరినీ పొగడకూడదని, అవతలి వ్యక్తి ఎంత గొప్పవాడు అయినా ఈ వైసీపీ నేతలు అతడిని తిడతారని పవన్ వెల్లడించారు. వైసీపీ నేతలు ఆఖరికి రజనీకాంత్ ను కూడా వదల్లేదని, ఆయనను కూడా తిట్టారని పవన్ వివరించారు.
జగన్ ను పంపించే సమయం వచ్చేసిందని, ఇక జగన్ కు టాటా చెప్పేద్దాం అని పిలుపునిచ్చారు. సీఎం పదవి వస్తే బలంగా పనిచేస్తానని, లేకపోతే బాధ్యతగా పనిచేస్తానని ఉద్ఘాటించారు. ఏదేమైనా ప్రజల కోసం నిలబడడం పక్కా అని పేర్కొన్నారు.
రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని, స్కూళ్లు మూతపడిపోతున్నాయని, వలసలు పెరుగుతున్నాయని అన్నారు. అందుకే తన ప్రాణం పోయేంత వరకు రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. అందరం కలిసి వెళతామనే అనుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.
ఇక, తానేమీ ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకం కాదని, ఇంకో రూ.10 వేలు ఎక్కువ ఇవ్వాలని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకునే వ్యక్తినని వివరించారు. జగన్… సంక్షేమ పథకాలకు ఇచ్చేది మీ డబ్బే… ఆయన తన జేబు నుంచి ఇవ్వడంలేదని అన్నారు. సంపద సృష్టించకుండా కేవలం పథకాలు మాత్రమే ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఆయన ఏపీ అధికార పక్షం వైసీపీపైనా, సీఎం జగన్ పైనా ధ్వజమెత్తారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీల బలం ఉన్న పార్టీ వైసీపీ… ఏ పదవి లేని, కేవలం జనసైనికుల బలం ఉన్న పార్టీ జనసేన పార్టీ అని పవన్ ఉద్ఘాటించారు. తాము ఎవరికీ భయపడబోమని, ఇవాళ టీడీపీ వాళ్లకు కూడా మేమున్నాం అనే బలాన్ని అందించామని తెలిపారు.
“ఎన్డీయే కూటమి నుంచి మేం బయటికి వచ్చేశాం అని విమర్శిస్తున్నారు. మేం ఎన్డీయేలో ఉంటే నీకేంటి, లేకపోతే నీకేంటి? పథకాలకు డబ్బులు ఇస్తూ కూడా మాకు భయపడుతున్నారంటే దానర్థం ఓడిపోతున్నారనే! మీరు ఇంకా భయపడాలి” అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి బయటికి రావాలి అనుకుంటే ఆ విషయం తానే చెబుతానని వెల్లడించారు. మేం బయటికి వచ్చేశామని మీరు చెబితే ఎలా? అంటూ మండిపడ్డారు. తాము ఎన్డీయేలోనే ఉన్నామని పవన్ సభా ముఖంగా స్పష్టం చేశారు. తనకు ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా అంటే అమితమైన గౌరవం ఉందని తెలిపారు. అందరం కలిసి వెళతామనే అనుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.
“కొందరు వైసీపీ వర్గీయులు బెదిరిస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత నీ అంతు చూస్తాం అంటున్నారు. నేను మీ ముఖ్యమంత్రి జగన్ తండ్రినే ఎదుర్కొన్నాను. ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయినప్పుడు ఎక్కడికీ పారిపోకుండా హైదరాబాదులోనే ఉన్నాను. ధైర్యంగా మళ్లీ పార్టీ పెట్టాను. పవన్ కల్యాణ్ మీ ఉడుత ఊపులకు భయపడేవాడు కాదు.
2014లో వైసీపీ ఓడిపోయింది… ఆ సమయంలో మా పార్టీ ఆఫీసు వద్దకు వైసీపీ రౌడీలు వచ్చారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఓడిపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోండి. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఉంటుందో, ఉండదో మీరే తేల్చుకోండి. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే” అంటూ పవన్ ధీమా వ్యక్తం చేశారు.