- తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరంలో జరగనున్న ఎన్నికలు
- 8-10 మధ్య షెడ్యూల్ వచ్చే చాన్స్
- ఒక్క విడతలోనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ ఎన్నికలు
- చత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు
- డిసెంబరు 10-15 మధ్య ఓట్ల లెక్కింపు
దేశంలో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే మొదలుపెట్టేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ రోజుకో కార్యక్రమంతో ప్రజల్లోనే ఉంటోంది. కాంగ్రెస్ కూడా అదే పనిలో ఉన్నప్పటికీ ఇంకా జోరందుకోలేదు. ఈ ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరంలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 8-10 మధ్య ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలకు ఉటంకిస్తూ ‘ఇండియా టుడే’ పేర్కొంది.
నవంబరు రెండో వారంలో కానీ, లేదంటే డిసెంబరు మొదటి వారంలో కానీ పోలింగ్ జరగొచ్చని పేర్కొంది. 2018 ఎన్నికల్లానే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణలో ఒక విడతలోనే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, గతంలో నిర్వహించినట్టుగానే చత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, ఎన్నికల తేదీలు మాత్రం వేర్వేరుగా ఉండనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబరు 10-15 మధ్య ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి.