- నెంబర్ ప్లేట్ లేకుండా ఈ-రిక్షా నడుపుతున్న మహిళా డ్రైవర్
- వాహనాన్ని పక్కన నిలపాలని ట్రాఫిక్ సిబ్బంది ఆదేశం
- పోలీసులతో మహిళ వాగ్వాదం.. కోపం పట్టలేక చెప్పుతో దాడి
ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ పోలీసులపై దాడి చేసి, చెప్పుతో కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చుట్టూ వాహనదారులు ఆశ్చర్యంగా చూస్తుండగా కానిస్టేబుల్ పై మహిళ దాడి చేయడం ఇందులో కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అసలేం జరిగిందని, ఎందుకు ఆ మహిళ దాడి చేసిందని కామెంట్లు పెడుతున్నారు. ఘజియాబాద్ లో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తాజాగా ఈ ఘటనపై యూపీ పోలీసులు స్పందించారు.
వీడియోలో దాడి చేస్తున్న మహిళ పేరు మిథిలేష్.. ఈ-రిక్షా డ్రైవర్. అయితే, ఈ-రిక్షాకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆపారు. బండి పక్కన పెట్టాలని సూచించిన కానిస్టేబుల్ తో మిథిలేష్ వాగ్వాదానికి దిగింది. ఆపై కోపం పట్టలేక దాడి చేసింది. చెప్పు తీసుకుని కొడుతూ, అసభ్య పదజాలంతో తిట్టింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో పోలీసు అధికారిని రోడ్డుపై పడదోసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై బాధిత అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మిథిలేష్ ను అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడి చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.