Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోంది: నారా లోకేశ్

  • తన తల్లి ఐటీ రిటర్నులు సీఐడీ చేతికి ఎలా వచ్చాయన్న లోకేశ్
  • గత పది రోజులుగా కేసు గురించి వైసీపీ మాట్లాడడంలేదని వెల్లడి
  • అక్రమ కేసుపై వైసీపీ క్యాడర్ లోనే అనుమానం ఉందంటూ వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్కిల్ కేసు, అమిత్ షాతో భేటీ, తదితర అంశాలపై స్పందించారు. స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోందని అనుమానం వెలిబుచ్చారు. తన తల్లి నారా భువనేశ్వరి ఐటీ రిటర్నులు సీఐడీ చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తన తల్లి ఐటీ రిటర్నుల విషయంలో సీబీడీటీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.  

క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. అక్రమ కేసుపై వైసీపీ క్యాడర్ లోనే అనుమానం ఉందని లోకేశ్ పేర్కొన్నారు. గత 10 రోజులుగా కేసు విషయమై వైసీపీ మాట్లాడడంలేదని తెలిపారు.  

ఢిల్లీ పర్యటనలో దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల  నేతలను కలిశానని తెలిపారు. ఇక చంద్రబాబు అంశంలో తాము 17ఏ అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశామని అన్నారు. 17ఏ పరిగణనలోకి తీసుకోకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నారు. 

అమిత్ షాతో భేటీపైనా లోకేశ్ వివరణ ఇచ్చారు. అమిత్ షాకు అన్ని వివరాలు తెలియజేసినట్టు వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పానని, చంద్రబాబు భద్రత పరంగా ఉన్న ఆందోళనను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. 

“సీఐడీ ఎందుకు పిలిచింది… ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే పెట్టిన కేసులు అని ఆయనకు చెప్పాను. ఇదంతా బీజేపీనే చేయిస్తోందని ఒక ఎంపీ, మంత్రి నేరుగా అన్నారని అమిత్ షాతో చెప్పాను. బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని అమిత్ షా స్పష్టంగా చెప్పారు. బీజేపీపై జగన్ నిందలు  మోపుతున్నారని కూడా ఆయన అన్నారు. ఈ కేసుల వ్యవహారంలో బీజేపీ పాత్ర ఉందని నేను అనుకోవడంలేదు. బీజేపీ నేతల మౌనంతోనే ఆరోపణలు వచ్చాయనుకుంటున్నాను. నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరాను. జరుగుతున్న పరిణామాల గురించి రాష్ట్రం నుంచి అమిత్ షా సమాచారం తీసుకున్నట్టు తెలిసింది. అమిత్ షా వద్ద ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదు” అని లోకేశ్ వెల్లడించారు. 

ఇక,తాము ఎన్డీయే, ఇండియా కూటములకు సమదూరంలో ఉన్నామని స్పష్టం చేశారు.

Related posts

Ram Narayana

ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం!

Ram Narayana

ప్రాంతాల వారీగా వైసీపీ క్యాడర్ తో సీఎం జగన్ సమావేశాలు… విశాఖలో తొలి సమావేశం

Ram Narayana

Leave a Comment