Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

గ్రూప్-2 పరీక్షల వాయిదా.. మనస్తాపంతో వరంగల్ యువతి ఆత్మహత్య.. అర్ధరాత్రి వరకు ఉడికిపోయిన హైదరాబాద్..!

  • నిన్న సాయంత్రం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న ప్రవళిక
  • విషయం తెలిసి హాస్టల్‌కు చేరుకున్న వందలాదిమంది గ్రూప్స్ అభ్యర్థులు
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
  • అర్ధరాత్రి వరకు మృతదేహం తరలింపును అడ్డుకున్న వైనం
  • విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్
  • అర్ధరాత్రి దాటాక ప్రవళిక మృతదేహం తరలింపు
  • కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయని పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతోంది. నవంబరు 2,3 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది.

పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్న ప్రవళిక వాయిదా పడడంతో మనస్తాపానికి గురైంది. నిన్న సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సహచర విద్యార్థుల సమాచారంతో హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు ప్రవళిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన గ్రూప్-2 అభ్యర్థులు ప్రభుత్వ నిర్వాకంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తరలించడం సాధ్యం కాకపోవడంతో అర్ధరాత్రి వరకు హాస్టల్‌లోనే ఉంది. విషయం తెలిసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఇతర నాయకులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు. 

నేను నష్టజాతకురాలిని..
ఆత్మహత్యకు ముందు ప్రవళిక తల్లిదండ్రులకు రాసినట్టుగా ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనను క్షమించాలని, తానో నష్టజాతకురాలినని ఆ లేఖలో ప్రవళిక ఆవేదన వ్యక్తం చేసింది. ‘నా వల్ల మీరెప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా. నన్ను కాళ్లు కిందపెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. ఏడవకండి అమ్మా. మీ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నా. నాన్న జాగ్రత్త’ అని ఆ లేఖలో ప్రవళిక పేర్కొంది. కాగా, ప్రవళిక కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఆధార్‌కార్డు ప్రకారం తండ్రి లింగయ్య అని మాత్రం తెలుస్తోంది. 

లాఠీ చార్జీ చేసి మృతదేహం తరలింపు
ప్రవళిక ఆత్మహత్యతో అశోక్‌నగర్‌లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదలబోమని గ్రూప్స్ అభ్యర్థులు భీష్మించుకున్నారు. అర్ధరాత్రి వరకు నిరసన తెలిపారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించాల్సి వచ్చింది. చివరికి అర్ధరాత్రి తర్వాత అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. దీంతో అభ్యర్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. చివరికి అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అభ్యర్థులతో కలిసి ఆందోళనకు దిగిన సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రోజులు దగ్గరపడ్డాయి బిడ్డా
ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నియంత కేసీఆర్ కుటుంబం బాగుంటే సరిపోదని పేర్కొన్నారు. వందలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి బిడ్డా అని హెచ్చరించారు. నిరుద్యోగ అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు అధైర్యపడొద్దని.. తొందరపాటు చర్యలు వద్దని హితవు పలికారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, మన నియామకాలు మనమే చేసుకుందామని, ఈ దొంగ దొరను తరిమి కొడదామని పిలుపునిచ్చారు.

Related posts

ధరణి పొర్టల్‌ను రద్దు త్వరలో ఆర్ఓఆర్ చట్టం… రెవెన్యూ మంత్రి పొంగులేటి

Ram Narayana

కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు రేవంత్ ప్రభుత్వం నిర్ణయం

Ram Narayana

సంక్రాంతి వేళ హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్… మూడ్రోజులు అన్ లిమిటెడ్ ప్రయాణం

Ram Narayana

Leave a Comment