- ప్రవళిక చనిపోయినట్లు శుక్రవారం సాయంత్రం సమాచారం అందిందని చెప్పిన పోలీసులు
- ఆమె గదిలో సూసైడ్ నోట్ దొరికినట్లు వెల్లడి
- ఆమె ఏ పోటీ పరీక్షలకు హాజరు కాలేదని స్పష్టీకరణ
- శివరామ్ అనే యువకుడి చాటింగ్‌ను గుర్తించినట్లు వెల్లడి
గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక దర్యాఫ్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
ప్రవళిక చనిపోయినట్లు శుక్రవారం సాయంత్రం తమకు సమాచారం అందిందని, ఆమె గదిలో సూసైడ్ నోట్ దొరికినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆమె ఏ పోటీ పరీక్షలకు హాజరు కాలేదన్నారు. ఆత్మహత్యలపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయన్నారు.
శివరామ్ రాథోడ్ అనే యువకుడితో ఆమె చాటింగ్‌ను గుర్తించినట్లు చెప్పారు. తనను మోసం చేసి శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోనున్నట్లు ఆ చాటింగ్ ద్వారా గుర్తించామన్నారు.
ప్రవళిక, శివరామ్ ఇద్దరూ ఓ హోటల్‌కు వెళ్లారని, ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ దొరికినట్లు చెప్పారు. శివరామ్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవళిక సెల్ ఫోన్, సీసీటీవీ ఫుటేజీ, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామన్నారు.
వ్యక్తిగత కారణాలతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు చెప్పినా పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని పోలీసులు తెలిపారు.