- గుడ్లు, బాదంలో దండిగా ప్రొటీన్
- పప్పులు, చిక్కుళ్లు, పనీర్ లోనూ ఎక్కువే
- రోజూ ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పటిష్టం
శారీరకంగా ఫిట్ గా ఉండాలన్నా, ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలన్నా అందుకు ప్రొటీన్ ఎంతో అవసరం. కండరాల వృద్ధికి, శారీరక మరమ్మతులకు ప్రొటీన్ కావాలి. వ్యాధి నిరోధక శక్తికి, హార్మోన్ల ఉత్పత్తికి సైతం ప్రొటీన్ అవసరం. కనుక ప్రతి రోజూ కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి. ఉదాహరణకు 75 కిలోల వ్యక్తికి రోజులో 60 గ్రాముల ప్రొటీన్ అవసరం. ఆహారం ద్వారా ఈ మేరకు లభించేలా చూసుకుంటేనే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది.
గుడ్లు
గుడ్లలో నాణ్యమైన ప్రొటీన్ ఉంటుంది. అన్నిరకాల అమైనో యాసిడ్స్ ఇందులో లభిస్తాయి. కనుక రోజూ ఒకటి నుంచి రెండు గుడ్లను తీసుకోవచ్చు.
బాదం
గుడ్లను తినలేని వారికి ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. బాదం గింజల్లో ప్రొటీన్ లభిస్తుంది. అలాంటి వారు బాదం గింజలను తినొచ్చు. రోజూ 30 గ్రాముల బాదం తినాల్సి ఉంటుంది. అంటే సుమారు 23 బాదం గింజలు. రోజువారీ బాదం గింజలు తినడం వల్ల రక్తంలో షుగర్ పరిమాణాన్ని నియంత్రిస్తుంది. కనుక టైప్2 మధుమేహం ఉన్న వారు బాదం గింజలను తినడం ఉపయోగకరం. బాదంలో విటమిన్ ఈ కూడా ఉంటుంది.
పప్పులు
పప్పుల్లోనూ ప్రొటీన్ ఉంటుంది. 100 గ్రాముల పప్పులో 20-25 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. మాంసం, గుడ్లు తినలేని వారికి అందుబాటులో ఉన్న ప్రొటీన్ పదార్థాల్లో పప్పులు కూడా ఒకటి. బీన్స్, చిక్కుళ్లు వంటి కాయ ధాన్యాల నుంచి కూడా ప్రొటీన్ లభిస్తుంది. రోజూ చిక్కుళ్లను తినడం వల్ల కేన్సర్, గుండె జబ్బులు రావాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
పనీర్/చీజ్
పనీర్ లోనూ ప్రొటీన్ దండిగా ఉంటుంది. ఒక్కసారి పనీర్ తినడం వల్ల ఆ రోజులో కావాల్సిన ప్రొటీన్ లో సగం లభిస్తుంది. కేలరీలు, ఫ్యాట్ కూడా తక్కువే. కనుక ప్రొటీన్ కోసం దీన్ని తీసుకోవచ్చు.