- కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించిందన్న కేసీఆర్
- ప్రజలు ఓటు ఆయుధంతో కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో వేయాలని పిలుపు
- ఉద్వేగంతో వెళ్లి ఓటేయవద్దని ప్రజలను కోరిన కేసీఆర్
భువనగిరిలో గత కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక శక్తులను పెంచి పోషించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ… గత కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరి అరాచక శక్తులకు అండగా నిలిచిందని, వారు ప్రజలను ఇబ్బందులు పెట్టారన్నారు. అరాచక, కిరాతక మూకలను ఏ విధంగా బీఆర్ఎస్ ఏరిపారేసిందో మీ అందరికీ తెలుసునన్నారు. ఈ రోజు భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తున్నారన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావొద్దని, మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలన్నారు.
ఉద్వేగంలో కొట్టుకొనిపోయి ఓటేస్తే మన జీవితాలను తలకింద చేసే పరిస్థితి ఉంటుందన్నారు. రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలని ధరణిని తీసుకువచ్చామని, ధరణి పోతే మళ్లీ తహసీల్దార్ ఆఫీస్‌లు, కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే భువనగిరిలో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటోందని, ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీనే బంగాళాఖాతంలో వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ జిల్లాకు భగవంతుడి పేరును కలిపి యాదాద్రి భువనగిరి జిల్లా అని పేరుపెట్టుకున్నామని, లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణ కాకపోతే భువనగిరి జిల్లానే కాకపోతుండె అన్నారు.
పైళ్ల శేఖర్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. 98 శాతం పూర్తయిన బస్వాపూర్ రిజర్వాయర్ కు నృసింహసాగర్ దేవుని పేరును పెట్టుకున్నామని, ఇది ప్రారంభమయ్యాక లక్ష ఎకరాలకు నియోజకవర్గమంతా నీళ్లు వస్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని బస్వాపూర్ ప్రాజెక్టు దాదాపు పూర్తయిందన్నారు.