- చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారన్న మోత్కుపల్లి
- జైల్లో ఉండాల్సింది కిరాతకులు మాత్రమేనన్న మోత్కుపల్లి
- చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్య
- జగన్ ఆటలు ఇక సాగవు… ప్రజలు ఆయన కుట్రలను తిప్పికొడతారన్న మోత్కుపల్లి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బేగంపేటలోని తన నివాసంలో ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారన్నారు. జైల్లో ఉండాల్సింది కిరాతకులు మాత్రమేనని, కానీ ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన చంద్రబాబు లాంటి వారు కాదన్నారు. జగన్ జైల్లో ఉండి వచ్చినంత మాత్రాన మిగిలిన వారు కూడా జైలుకు వెళ్లాలా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆయనను మానసిక క్షోభకు గురిచేస్తుంటే అందరూ తల్లడిల్లిపోతున్నారన్నారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా? అని నిలదీశారు. జగన్ కారణంగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు.
ఇక జగన్ ఆటలు సాగవని, ప్రజలు ఇక ఆయన కుట్రలను సాగనివ్వరన్నారు. నీ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలించినా ఇన్ని కుట్రలు చేయలేదన్నారు. తాను కడుపుమండి మాట్లాడుతున్నానని, ఇక ప్రజలు జగన్ ఆట కట్టించడం ఖాయమన్నారు. డాక్టర్ సుధాకర్‌ను చంపిన పాపం జగన్‌దే అన్నారు. పేద ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆయన దుర్మార్గంగా ఉపయోగించుకుంటున్నారన్నారు.