- 90-99 పరుగుల వద్ద ఎనిమిది సార్లు ఔటయిన విరాట్
- వన్డేల్లో 6, టెస్టుల్లో 2 సార్లు ఇలాంటి పరిస్థితి
- అవన్నీ సెంచరీలు అయ్యుంటే రికార్డులే రికార్డులు
‘కింగ్’ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌తో అదరగొడుతున్నాడు. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2023లో చెలరేగి ఆడుతున్నాడు. ప్రత్యర్థి ఏ జట్టు అయినా నిలకడగా రాణిస్తూ టీమిండియా జైత్రయాత్రలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ మొత్తం 354 పరుగులు కొట్టి టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఫామ్ దృష్ట్యా ప్రపంచ కప్‌లో సెంచరీలు విరాట్‌ని ఊరిస్తున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే ఒక సెంచరీ కొట్టగా ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌పై శతకం త్రుటిలో తప్పింది. వ్యక్తిగత స్కోరు 95 పరుగుల వద్ద విరాట్ ఔటయ్యాడు. దీంతో సెంచరీ చేజారినట్టయ్యింది. ఈ సెంచరీ చేసి ఉంటే ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన 49 సెంచరీల రికార్డును సరిసమానం చేసేవాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. దీంతో విరాట్ కోహ్లీ 90 నుంచి 99 పరుగుల వద్ద ఎన్నిసార్లు ఔటయ్యాడనేది ఆసక్తికరంగా మారింది.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టెస్టులు, వన్డేలు, టీ-20లు అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 8 సార్లు 90ల్లో ఔటయ్యాడు. వన్డేల్లో 6 సార్లు, టెస్టుల్లో 2 సార్లు 90 నుంచి 99 పరుగుల వద్ద కోహ్లీ ఔటయ్యాడని గణాంకాలు చెబుతున్నాయి. మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ ఇప్పటికి 78 సెంచరీలు కొట్టిగా 90ల్లో ఔటయిన 8 సందర్భాలు కూడా సెంచరీలుగా మలచివుంటే కోహ్లీ ఇప్పటికి 86 సెంచరీలు పూర్తి చేసుకొని ఉండేవాడు. పలు రికార్డులు సాధించి ఉండేవాడు. ఇక న్యూజిలాండ్‌పై సెంచరీని పక్కనపెడితే న్యూజిలాండ్‌పై కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఇది తన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.