Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం

  • 20వ పిల్లర్ వద్ద కుంగిన బ్యారేజీ
  • ఆరుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
  • బ్యారేజీని పరిశీలించిన అనిల్ జైన్ నేతృత్వంలోని కేంద్ర కమిటీ

మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కేంద్ర బృందం మంగళవారం పరిశీలించింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ వద్ద కుంగిన విషయం తెలిసిందే. దీంతో ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని కేంద్ర కమిటీ ఈ బ్యారేజీని నేడు పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించింది. బ్యారేజ్ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేయనుంది. సమగ్ర పరిశీలన అనంతరం కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందిస్తుంది.

కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఉన్నారు. ఈ బ్యారేజీ కుంగడంతో నీటిని విడుదల చేశారు. నీటి మట్టం కనిష్ఠస్థాయికి చేరుకుంది. బ్యారేజ్ ఎగువ నుంచి 57 గేట్ల ద్వారా 22,500 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. మూడు రోజుల క్రితం రాత్రి భారీ శబ్దంతో బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగిపోయింది. దీంతో బీ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. క్రస్ట్ గేటుకు పగుళ్లు వచ్చాయి.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన అంశంపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన అంశంపై మహదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 21వ తేదీన రాత్రి పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఫిర్యాదు చేశారు. మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కుట్రకోణం ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల ఫిర్యాదు నేపథ్యంలో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం వచ్చిందని ఫిర్యాదు రావడంతో ఆ కోణంపై పోలీసులు దృష్టి సారించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ కుంగిన అంశంలో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేయనున్నారు.

Related posts

ఇది ప్రజాప్రభుత్వం ..ఇందిరమ్మ రాజ్యం…మంత్రి పొంగులేటి

Ram Narayana

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి సంబంధించిన జీవో విడుదల

Ram Narayana

లక్ష గొంతుకల పొలికేక …సిపిఐ కొత్తగూడం గర్జన….

Drukpadam

Leave a Comment