- అధికంగా చోరీకి గురయ్యే వాటిల్లో రెండు మారుతి సుజుకీవే
- మారుతి స్విఫ్ట్, మారుతి వ్యాగన్ ఆర్ విషయంలో జాగ్రత్త
- హ్యుందాయ్ క్రెటా, శాంట్రో కార్లకూ డిమాండ్ ఎక్కువే
ఇల్లు.. ప్రతి కుటుంబానికి ఉండే కల. అలాగే, ఇప్పుడు కారు కూడా ప్రతి కుటుంబానికి ఓ స్వప్నంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. అందుబాటు ధరకే ఎక్కడకు వెళ్లి రావాలన్నా, సొంతంగా కారు కచ్చితంగా ఉండాల్సిందేనని చాలా మంది భావిస్తున్నారు. కానీ, కారు ఖరీదైన కొనుగోళ్లలో ఒకటి. అందుకే సెకండ్ హ్యాండ్ (యూజ్డ్ కార్స్) కార్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. కంపెనీ అధీకృత సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్ లలో ఇప్పుడు పాత కార్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ డిమాండ్ తో కారు చోరీలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే సులభంగా వాటిని విక్రయించుకునే అవకాశాలు ఉండడం వల్లే. ఏటా మన దేశంలో సుమారు లక్ష కార్లు చోరీ అవుతున్నట్టు అంచనా. మన దేశంలో ఎక్కువగా చోరీకి గురయ్యే కార్లు, వాటి వెనుక ఆసక్తికర అంశాలను చూద్దాం.
మారుతి సుజుకీ స్విఫ్ట్
దేశంలో ఎక్కువగా చోరీకి గురి అవుతున్న వాటిల్లో మారుతి స్విఫ్ట్ ఒకటి. అంతేకాదు, దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లలో ఇది కూడా ఒకటి. మెరుగైన మైలేజ్, తిరిగి విక్రయిస్తే మంచి రేటు పలకడం, చూడ్డానికి అందంగా ఉండడం దీని అనుకూలతలు. అందుకే స్విఫ్ట్ యజమానులు తమ కారు రక్షణ విషయంలో కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్
మారుతి సుజుకీ స్విఫ్ట్ మాదిరే మారుతి వ్యాగన్ ఆర్ మోడల్ విక్రయాలు కూడా ఏటా గణనీయ సంఖ్యలో నమోదవుతున్నాయి. అందుకే కారు చోరీల్లోనూ వ్యాగన్ ఆర్ కు సంబంధించి ఎక్కువగా నమోదవుతున్నాయి. మారుతి కార్లకు రీసేల్ వ్యాల్యూ (తిరిగి అమ్ముకుంటే) ఎక్కువగా ఉండడం ఇందుకు అనుకూలించే అంశాల్లో ఒకటి.
హ్యుందాయ్ క్రెటా
దేశంలో ఎక్కువ చోరీ అవుతున్న కార్లలో మూడో స్థానంలో ఉన్నది హ్యుందాయ్ క్రెటా. దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఎస్ యూవీల్లో ఇది కూడా ఒకటి. అందుకే దీని చోరీలు ఎక్కువగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించదు. హ్యుందాయ్ క్రెటా ఎంత పాతది అయినా, చోరీ రిస్క్ ఎక్కువే. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీని స్పేర్స్ (విడిభాగాలు)కు సైతం డిమాండ్ ఎక్కువగా ఉంది. దీని ఆరంభ రూ.11 లక్షలు.
హ్యుందాయ్ శాంట్రో
అదేంటి.. ఈ మోడల్ ఎఫ్పుడో నిలిచిపోయిందిగా? అని అనుకోవద్దు. ఇటీవలే శాంట్రో కొత్త మోడల్ ను హ్యుందాయ్ మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. పైగా గతంలో విక్రయించిన శాంటో కార్లు పాతబడినా, చక్కగా పనిచేస్తూ రోడ్లపై తిరుగుతూనే ఉన్నాయి. దీంతో శాంట్రో కారుతోపాటు, దాని విడిభాగాలకూ డిమాండ్ ఎక్కువగా నెలకొంది. దీంతో ఈ కారు చోరీల్లో ముందంజలో ఉంది.
హోండా సిటీ
దేశంలో ఎక్కువగా చోరీకి గురవుతున్న కార్లలో హోండా సిటీ ఒకటి. హోండాకు సంబంధించి ఎక్కువగా అమ్ముడయ్యే కార్లలో ఇది ముందు వరుసలో ఉంది. ఇవన్నీ ఎంతో పాప్యులర్ అయినవి కావడంతో వీటిని తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుగోలు చేసే వారు పెరిగారు. ఈ డిమాండ్ పెరుగుతోందే కానీ, తగ్గడం లేదు. ఇది చోరులకు కలిసొస్తోంది.