- సౌర కుటుంబం గుట్టుమట్లు తెలుసుకునేందుకు నాసా పరిశోధన
- అంతరిక్షంలోకి ఓఎస్ఐఆర్ఐఎస్-ఆర్ఈఎక్స్ ప్రయోగం
- బెన్ను గ్రహశకలం నుంచి నమూనాలు సేకరించిన వ్యోమనౌక
- డబ్బా మూత తీసేందుకు కొత్త పద్ధతులు అన్వేషించిన నాసా
అనేక ఖగోళ రహస్యాలను విప్పిచెప్పిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇప్పుడొక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓ వ్యోమనౌక ఎంతో శ్రమించి ‘బెన్ను’ అనే గ్రహశకల శాంపిళ్లను భూమికి తీసుకువస్తే, ఆ శాంపిళ్లు ఉన్న డబ్బాను తెరవలేక నాసా ఆపసోపాలు పడుతోంది. ఓ ప్రత్యేకమైన మెకానిజంతో కూడిన ఆ డబ్బా మూత బిగుసుకుపోవడమే అందుకు కారణం.
అంతరిక్షం నుంచి గ్రహశకలాల నమూనాలను సేకరించి, వాటిసాయంతో సౌర కుటుంబం గుట్టుమట్లు తెలుసుకోవాలన్నది నాసా ప్రణాళిక. ఇందులో భాగంగానే ‘ఓఎస్ఐఆర్ఐఎస్-ఆర్ఈఎక్స్’ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ తన ఏడేళ్ల ప్రస్థానంలో ‘బెన్ను’ గ్రహశకలం నుంచి నమూనాలను సేకరించి ఓ డబ్బాలో భద్రపరిచి భూమికి తీసుకువచ్చింది. ఇప్పుడీ డబ్బా మూత తీయడం అనేది నాసాకు ఓ సవాల్ గా మారింది.
ఈ మూతను బలప్రయోగం చేసి తీయవచ్చు కానీ, అందులో ఉన్న అత్యంత కీలక గ్రహశకల నమూనాలు దెబ్బతింటాయని నాసా ఆందోళన చెబుతోంది. అందుకే, ఎలాంటి నష్టం వాటిల్లకుండా డబ్బా మూత తీసేందుకు కొత్త పద్ధతులను అన్వేషించింది. ఇప్పటివరకు కొంత మేర గ్రహశకల నమూనాలను డబ్బానుంచి వెలికితీసింది.
వాస్తవానికి ‘బెన్ను’ గ్రహశకలం నుంచి 60 గ్రాముల బరువున్న నమూనాలు తీసుకువస్తే చాలని నాసా భావించింది. అయితే, నాసా ప్రయోగించిన వ్యోమనౌక 70.3 గ్రాముల గ్రహశకల పదార్థాన్ని భూమికి తీసుకువచ్చింది. త్వరలోనే మిగతా గ్రహశకల నమూనాలను కూడా డబ్బా నుంచి పూర్తిగా వెలికితీసేందుకు నాసా శ్రమిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను నాసా తన బ్లాగ్ లో వివరించింది.