- పంజాబ్ లోని బర్నాలాలో దారుణం
- ఓ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు
- బర్నాలాలో హోటల్ కు వచ్చి భోజనం చేసిన నలుగురు ఆటగాళ్లు
- బిల్లు విషయంలో హోటల్ యజమానితో గొడవ
- అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులపై ఆటగాళ్ల దాడి
పంజాబ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కబడ్టీ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆటగాళ్లు హోటల్ బిల్లు విషయంలో గొడవకు దిగడమే కాకుండా, ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ను కూడా కొట్టి చంపారు.
అసలేం జరిగిందంటే… బర్నాలా పట్టణం సమీపంలోని రాయ్ సర్ గ్రామం వద్ద కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఓ జట్టు తరఫున ఆడేందుకు వచ్చిన ఆటగాళ్లలో నలుగురు బర్నాలాలోని ఓ రెస్టారెంట్ లో భోజనం చేశారు. అయితే బిల్లు విషయంలో ఆ నలుగురు కబడ్డీ ఆటగాళ్లకు, హోటల్ యజమానికి మధ్య వివాదం రేగింది. దాంతో ఆ ఆటగాళ్లు అక్కడున్న ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడంతో, హోటల్ యజమాని పోలీసులకు సమాచారం అందించారు.
ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని కబడ్డీ ఆటగాళ్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, కబడ్డీ ఆటగాళ్లు హెడ్ కానిస్టేబుల్ దర్శన్ సింగ్ పై దాడికి దిగారు. ఆయనను తీవ్రంగా కొట్టారు. ఆ హెడ్ కానిస్టేబుల్ కిందపడిపోగా, ఆయన తల నేలకు గట్టిగా గుద్దుకుని బలమైన గాయం అయింది. వెంటనే బర్నాలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ హెడ్ కానిస్టేబుల్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.
ఈ ఘటన జరిగిన అనంతరం కబడ్డీ ఆటగాళ్లు పరారయ్యారు. పోలీసుపై దాడికి పాల్పడిన వారిని పరంజిత్ సింగ్, జగ్ రాజ్ సింగ్, గుర్మీత్ సింగ్, వజీర్ సింగ్ గా గుర్తించినట్టు బర్నాలా పోలీసు ఉన్నతాధికారి సందీప్ కుమార్ మాలిక్ తెలిపారు. వారిపై హత్య కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పందించారు. మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి నష్ట పరిహారంగా రూ.1 కోటి అందిస్తున్నట్టు ప్రకటించారు. అటు, పోలీసు శాఖ బీమా సదుపాయం ద్వారా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ నుంచి మరో రూ.1 కోటి ఆ పోలీసు కుటుంబానికి దక్కనుంది.
కాగా, పరారీలో ఉన్న నలుగురు కబడ్డీ ఆటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పోలీసులపై కాల్పులు జరపగా, ఎదురు కాల్పుల్లో ఆటగాళ్లలో ఒకరికి గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, మిగతా నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు.