- ఎక్స్ హ్యాండిల్ ద్వారా లగ్గం వేడుక వీడియోనూ షేర్ చేసిన కాంగ్రెస్
- అమర వీరుల ఆత్మఘోషతో… బీజేపీ, బీఆర్ఎస్ లగ్గం పిలుపు అంటూ కార్డులు ప్రింట్
- కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పెళ్లి… అర్సుకునేటోళ్లు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అని పేర్కొన్న కాంగ్రెస్
- నోట్ల రద్దు నుంచి బండి సంజయ్ అధ్యక్ష పదవి తొలగింపు వరకు ఏడు అడుగులు ఇవే…
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తెలంగాణ ప్రజలకు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారంతో ముందుకు వచ్చింది. బీజేపీ-బీఆర్ఎస్ లగ్గం పిలుపు అంటూ పెళ్లి కార్డ్ రూపంలో ఆహ్వాన పత్రికను తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసింది.
‘బీజేపీ❤️బీఆర్ఎస్ లగ్గం పిలుపు, తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషతో..’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్‌గా ‘శ్రీరస్తు శుభమస్తు’ పాటను వేసింది. అంతే కాదు ఈ బీఆర్ఎస్ – బీజేపీ లగ్గం కార్డులను ప్రింట్ చేసి పలువురికి పంచారు. ఈ లగ్గం పిలుపుకు ఆహ్వానించువారూ బీజేపీ, మరియు బీఆర్ఎస్సేనని ఆ కార్డులో పేర్కొంది. బీఆర్ఎస్‌కు బీజేపీ ఇచ్చే కట్నం… మద్యం కుంభకోణంలో కవితమ్మ అరెస్ట్ కాకుండా అభయమని పేర్కొంది.
లగ్గం వేడుక… రాజకీయ బాగోతం వేసేవారి ఇంట అని, కేసీఆర్ ఫామ్ హౌస్‌లో అని, అర్సుకునేటోళ్లు కేటీఆర్, హరీశ్ రావు, కవిత, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ అని ఆ కార్డులో పేర్కొంది. నాకు నువ్వు బీఆర్ఎస్, నీకు నేను బీజేపీ… మాది లోపాయికారి ఒప్పందం మాది అని పేర్కొంది.
పెళ్లిలో వేసే ఏడడుగులకు కూడా కాంగ్రెస్ కొత్త అర్థం చెప్పింది. మొదటి అడుగు నోట్ల రద్దు సమయంలో ఒకరికి మరొకరు, రెండో అడుగు కాళేశ్వరం కుంభకోణానికి మోదీ అండ, మూడో అడుగు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ట్యాక్స్ కుంభకోణం, నాలుగో అడుగు ధరణితో తెలంగాణలో భూముల కుంభకోణం, ఐదో అడుగు లక్ష ఉద్యోగాలని కేసీఆర్, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని మోదీ నయవంచన, ఆరో అడుగు పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ వేయకపోవడం, ఏడో అడుగు బండి సంజయ్ అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డి చేతిలో పెట్టడమని పేర్కొంది.