Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • శ్రీశైలంలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం… హాజరైన లక్ష్మీనారాయణ
  • అదే సమయంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఉన్న ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి
  • ఎమ్మెల్యేను ఆహ్వానించేందుకు వెళ్లిన లక్ష్మీనారాయణ
  • లక్ష్మీనారాయణ వేదికపైకి వచ్చి మాట్లాడాలని కోరిన శిల్పా చక్రపాణిరెడ్డి
  • నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ప్రశంసిచిన సీబీఐ మాజీ జేడీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను గతంలో అక్రమాస్తుల కేసులో సీబీఐ అరెస్ట్ చేసినప్పుడు, విచారణ అధికారిగా వీవీ లక్ష్మీనారాయణ వ్యవహరించారు. అప్పట్లో ఆయన సీబీఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఉద్యోగ విరమణ చేశాక వీవీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత జనసేనకు రాజీనామా చేశారు. తాజాగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు.

అసలేం జరిగిందంటే… లక్ష్మీనారాయణ బాల్యంలో శ్రీశైలంలో విద్యాభ్యాసం చేయగా, తాజాగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీశైలం వచ్చిన లక్ష్మీనారాయణ… ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కూడా శ్రీశైలంలోనే ఉన్నారని తెలుసుకుని ఆయనను ఆహ్వానించేందుకు వెళ్లారు. 

అదే సమయంలో శిల్పా చక్రపాణిరెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య కార్యక్రమంలో ఉన్నారు. దాంతో, శిల్పా చక్రపాణిరెడ్డి వేదికపైకి వచ్చి మాట్లాడాలంటూ సీబీఐ మాజీ జేడీని కోరారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించిన లక్ష్మీనారాయణ వేదికపైకి వెళ్లి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

“ఈ ప్రభుత్వంలో నాడు-నేడు కార్యక్రమం చక్కగా అమలవుతోంది. ఈ స్కూలు చూడండి ఎంత అందంగా కనిపిస్తోందో! నేను చదువుకున్న పాఠశాలలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, పిల్లలకు మంచి ఆహారం అందించడం, అందులో రాగి జావను చేర్చడం అభినందనీయం. పోషకాహారం అందించడం ప్రభుత్వం బాధ్యత. దాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. 

సాధారణంగా హెల్త్ క్యాంపులు ఒక రోజుతో ముగిస్తుంటారు. కానీ ఈ క్యాంపు (జగనన్న ఆరోగ్య సురక్ష) అందుకు భిన్నమైనది. సహజంగా ఆరోగ్య కార్యక్రమాలకు రావాలంటూ ప్రజలను పిలుస్తుంటారు. కానీ డాక్టర్లే ప్రజల ఇళ్ల వద్దకు వస్తున్నారు. దాదాపు 9 వేల మందిని పరీక్షించి, వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నాయో గుర్తించి, అలాంటి వారిని ఇవాళ ఈ క్యాంపుకు పిలిచారు. 

అంతేకాదు, వారి ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ, ఆయా ఆరోగ్య ఇబ్బందుల నుంచి ప్రజలను బయట పడేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని మనమందరం నిజంగా అభినందించాలి” అని లక్ష్మీనారాయణ కొనియాడారు.

Related posts

 ఇకపై ‘జగనన్న గారూ’ అనే పిలుస్తా: వైఎస్ షర్మిల

Ram Narayana

వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణ కాన్వాయ్ పై డిటొనేటర్ దాడి… తప్పిన ముప్పు

Ram Narayana

ఓ దొంగను అరెస్ట్ చేస్తే ఉల్లంఘనా? ఇంట్లో ఉంటానంటే ఇక అరెస్ట్ ఎందుకు?: సజ్జల రామకృష్ణారెడ్డి

Ram Narayana

Leave a Comment