- కర్ణాటకకు వెళ్లి రైతులను ఆరా తీద్దాం.. రెడీనా అంటూ ప్రశ్న
- కాంగ్రెస్ నేతల ఆరోపణలపై మండిపడ్డ తెలంగాణ మంత్రి
- కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి ఆందోళన చేస్తున్నారని వెల్లడి
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇస్తోందని ఆరోపించారు. కర్ణాటకను మోడల్ గా చూపుతూ కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతున్నారు.. కానీ, అక్కడి రైతులేమో కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని ఆరోపిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ను నమ్మొద్దంటూ కర్ణాటక రైతులు రాష్ట్రానికి వచ్చి మరీ ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
వారికి డబ్బులు ఇచ్చి తామే తీసుకొచ్చామని కాంగ్రెస్ ఆరోపించడం హాస్యాస్పదమని కేటీఆర్ కొట్టిపారేశారు. అందరమూ కలిసి వెళ్లి కర్ణాటకలో రైతుల పరిస్థితి ఏంటనేది ఆరా తీద్దాం.. మీరు రెడీగా ఉన్నారా అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. మరోవైపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈమేరకు హైదరాబాద్ లో శనివారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) ఆధ్వరంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలను జర్నలిస్టులతో పంచుకున్నారు.. కార్యక్రమంలో ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి , టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ ఐజేయూ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ .ఎచ్ యూ జె అధ్యక్షులుసిగ శంకర్ గౌడ్ తదిరలులు పాల్గొన్నారు..
బీజేపీ తమ ఓటమి నెపాన్ని బీసీలపైకి నెట్టడానికే బీసీ ముఖ్యమంత్రిని తెరపైకి తెచ్చింది: కేటీఆర్
తాము పగతీర్చుకోవాలనుకుంటే… కక్ష రాజకీయాలు చేయాలనుకుంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈపాటికి ఊచలు లెక్కబెట్టేవారని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ… బీజేపీ తమ ఓటమి నెపాన్ని బీసీ పైకి నెట్టడానికే బీసీ ముఖ్యమంత్రిని తెరపైకి తీసుకు వచ్చిందని ఆరోపించారు. బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు.
ముఖ్యమంత్రి, ప్రధాని అయినంత మాత్రాన తమ సొంత సామాజికవర్గాలకు, నియోజకవర్గాలకు లాభం జరుగుతుందనే అపోహ సరికాదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ వచ్చాయన్నారు. గురుకులాల్లో వేలాది టీచర్ పోస్టులను భర్తీ చేశామన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే ఆరోపణ సరికాదన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అయిదేళ్ల క్రితమే పూర్తయిందని, మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది వచ్చిన వరదలను తట్టుకుందని చెప్పారు. అయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథార్టీ నివేదిక రానివ్వండి అన్నారు. ఏదైనా సమస్య ఉంటే ప్రజలపై భారం పడకుండానే సంస్థనే ఈ డ్యాంను బాగు చేస్తుందన్నారు. కాళేశ్వరం చివరి ఆయకట్టుకు నీళ్లు అందుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో పార్టీల విమర్శలు సరికాదన్నారు. దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగితే ఒక్క హైదరాబాద్‌లోనే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు.