Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ హామీలపై సంతకం… మూహూర్తం ఫిక్స్.. డీకే శివకుమార్

  • కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని డీకే శివకుమార్ నిలదీత
  • కేసీఆర్, కేటీఆర్ కర్ణాటక వచ్చి పథకాల అమలు తీరును చూస్తానంటే బస్సు పెడతానని సవాల్
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు హామీలపై సంతకం చేస్తారని వ్యాఖ్య
  • డిసెంబర్ 9 ఉదయం పదిన్నరకు ప్రమాణ స్వీకారం సమయం ఫిక్స్ చేశామన్న డీకే శివకుమార్

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎల్బీ స్టేడియంలో తాము ఇచ్చిన ఆరు హామీలపై మొదటి సంతకం చేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తాండూరులో నిర్వహించిన విజయభేరి యాత్రలో ఆయన మాట్లాడుతూ… ప్రజల బలమే కాంగ్రెస్, కాంగ్రెస్ బలమే దేశ బలం అన్నారు. కర్ణాటకలో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చామన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అని ప్రశ్నించారు.

కర్ణాటకలో తాము ఐదు హామీలు ఇచ్చి నెరవేర్చామని, ఇక్కడ తెలంగాణలో ఆరు హామీలు ఇచ్చామని, వాటిని కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఈ ఆరు సూత్రాల్లో మహాలక్ష్మి కూడా ఉందని, మహిళలకు కర్ణాటకలోలా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు తాను సవాల్ విసురుతున్నానని, ఇక్కడి నుంచి పది కిలో మీటర్లు వస్తే కర్ణాటక వస్తుందని, మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు నేనే బస్సు పెడతానని, అప్పుడు కర్ణాటకకు వచ్చి మేం విద్యుత్ ఎలా ఇస్తున్నామో… ఐదు హామీలు ఎలా అమలు చేస్తున్నామో చూడవచ్చునని శివకుమార్ అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, స్థలాలు లేనివారికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఎల్బీ స్టేడియంలో ఆరు పథకాలపై మొట్టమొదటి సంతకం పెడతారన్నారు. కాంగ్రెస్ పక్కాగా అధికారంలోకి వస్తుందని, డిసెంబర్ 9న పదిన్నర గంటలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశామని చెప్పారు. చివరగా ఒక మాట చెబుతున్నానని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ఆయన కుటుంబం ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటుందని డీకే శివకుమార్ అన్నారు.

కేసీఆర్ ఓటమిని అంగీకరించాడు… రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా తన ఓటమిని అంగీకరించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అక్రమాలను వెలికితీస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తాండూరులో నిర్వహించిన విజయభేరి యాత్రలో ఆయన మాట్లాడుతూ… మేం ఓడిపోతే మాకేం నష్టం లేదు, ప్రజలే నష్టపోతారని కేసీఆర్ ఇటీవల అన్నారని, ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పారని పరోక్షంగా ఆయన ఓటమిని అంగీకరించారన్నారు. కానీ కేసీఆర్ ఓడిపోయాక కాంగ్రెస్ ఊరుకోదని, పదేళ్లు అధికారంలో ఉండి మింగిన లక్ష కోట్లను, హైదరాబాద్‌లో ఆక్రమించిన పదివేల ఎకరాలను కక్కిస్తామన్నారు.

కేటీఆర్ కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రియాల్టీ దెబ్బతింటుందని చెబుతున్నారని, కానీ హైదరాబాద్ బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందిందా? అని ప్రశ్నించారు. ఈ రోజు హైదరాబాద్ రియాల్టీ రంగంలో మొదటిస్థానంలో ఉందంటే కాంగ్రెస్ తెచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, కాంగ్రెస్ నిర్మించిన విమానాశ్రయమన్నారు. ఐటీ పరిశ్రమలు రావడానికి కాంగ్రెస్ కారణమని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో ఈ రోజు ఎకరం రూ.100 కోట్లు పలుకుతుందంటే అందుకు కాంగ్రెస్ కారణమన్నారు. శాంతిభద్రతలు, మతసామరస్యం కాపాడేది కాంగ్రెస్ అన్నారు.

మీ దయ కొడంగల్, తాండూరులో కాంగ్రెస్‌కు ఎంత మెజార్టీ ఇస్తారో? అని రేవంత్ సభకు వచ్చిన వారిని ఉద్దేశించి అన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ 1.23 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారని, ఇక్కడ తమకు ఎంత మెజార్టీ వస్తుందనేది చూస్తామన్నారు. కార్యకర్తలు పట్టుదలతో పని చేయాలని పిలుపునిచ్చారు. 

Related posts

రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Ram Narayana

బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అబ్రహం

Ram Narayana

తెలంగాణ టీడీపీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి ఆ పార్టీ పొలిట్ బ్యూరో చీఫ్ రావుల!

Ram Narayana

Leave a Comment