- సీనియర్ లాయర్ తనను ‘మైలార్డ్’ అని పిలవడంపై జస్టిస్ నరసింహ అసంతృప్తి
- ‘సర్’ అని ఎందుకు పిలవరని ప్రశ్న
- బుధవారం కోర్టులో వెలుగు చూసిన ఘటన
కోర్టులో న్యాయవాది తనను పలుమార్లు ‘మైలార్డ్’, ‘యువర్ లార్డ్‌షిప్’ అని సంబోధించడంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇలా ఎన్నిసార్లు పిలుస్తారు. మీరు ఇలా పిలవడం ఆపితే నేను మీకు నా శాలరీలో సగం ఇచ్చేస్తాను’’ అని వ్యాఖ్యానించారు. మీరు నన్ను ‘సర్’ అని ఎందుకు పిలవరు? అని ఆ సీనియర్ లాయర్‌ను జస్టిస్ నరసింహ ప్రశ్నించారు. ఇలా పిలవడం మానకుంటే ‘మైలార్డ్’ అని ఎన్నిసార్లు అన్నదీ లెక్కబెట్టడం మొదలెడతానని కూడా సరదాగా వ్యాఖ్యానించారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
న్యాయమూర్తులను ‘మైలార్డ్’ లేదా ‘యువర్ లార్డ్‌షిప్’ అని న్యాయవాదులు, పిటిషనర్లు సంబోధించడం బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం. అయితే, అనేక మంది ఈ సంప్రదాయాన్ని బానిస పాలనకు సంకేతంగా అభివర్ణిస్తూ వ్యతిరేకిస్తున్నారు.
2006లోనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ పదాల వినియోగాన్ని ముగించాలంటూ తీర్మానించింది. అయితే, వీటికి అలవాటు పడిపోయిన లాయర్లు ఈ సంప్రదాయాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు.