- మరి కొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
- ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం
- ఒపీనియన్ పోల్ చేపట్టిన ఏబీసీ సీ ఓటర్
- తెలంగాణలో బీఆర్ఎస్… మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ కు మొగ్గు
- రాజస్థాన్ లో బీజేపీ హవా, మిజోరంలో ఎంఎన్ఎఫ్ కే చాన్స్
మరి కొన్ని రోజుల్లో తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై యావత్ దేశం ఆసక్తి చూపుతోంది. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జయభేరి మోగించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో, దేశంలో బీజేపీ హవా తగ్గుతోందా? అనే అంశం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో తేలనుంది.
ఇప్పటివరకు పలు సర్వేలు వివిధ పార్టీల గెలుపు అవకాశాలను అంచనా వేశాయి. తాజాగా ఏబీసీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఖాయమని సర్వే చెబుతోంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్… రాజస్థాన్ లో బీజేపీ, మిజోరంలో ఎంఎన్ఎఫ్ పార్టీకి మొగ్గు ఉందని ఏబీసీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనాలు చూస్తే అర్థమవుతోంది.
ఏబీసీ సీ ఓటర్ సర్వే ప్రకారం…
తెలంగాణ
మొత్తం అసెంబ్లీ స్థానాలు 119 కాగా…. అధికార బీఆర్ఎస్ పార్టీకి 49 నుంచి 61 స్థానాలు లభిస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 43 నుంచి 55 స్థానాలు వస్తాయని అంచనా. బీజేపీకి 5 నుంచి 11 స్థానాలు, ఇతరులకు 4 నుంచి 10 స్థానాలు వస్తాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 88 సీట్లు రాగా, కాంగ్రెస్ కు 19 సీట్లు వచ్చాయి. బీజేపీ 1, ఇతరులు 11 చోట్ల గెలిచారు.
మధ్యప్రదేశ్
మొత్తం అసెంబ్లీ స్థానాలు 230. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కు 118 నుంచి 130 స్థానాలు లభించనున్నాయి. బీజేపీ 99 నుంచి 111 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీఎస్పీ 3, ఇతరులు రెండు చోట్ల గెలవొచ్చన్నది ఏబీసీ సీ ఓటర్ అంచనా. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలవగా, బీజేపీ 109 స్థానాల్లో నెగ్గింది. బీఎస్పీ 2, ఇతరులు ఐదింట గెలిచారు.
రాజస్థాన్
మొత్తం అసెంబ్లీ స్థానాలు 200. బీజేపీ 114 నుంచి 124 స్థానాల వరకు గెలుస్తుందని అంచనా. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి 67 నుంచి 77 స్థానాలు లభించనున్నాయి. బీఎస్పీ 4, ఇతరులు 5 నుంచి 9 స్థానాల్లో గెలిచే అవకాశం. రాజస్థాన్ లో గత ఎన్నికల్లో బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కు 100 స్థానాలు లభించాయి. బీఎస్పీ 6, ఇతరులు 21 చోట్ల నెగ్గారు.
ఛత్తీస్ గఢ్
మొత్తం అసెంబ్లీ స్థానాలు 90. కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 51 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీకి 36 నుంచి 42 స్థానాలు దక్కే అవకాశం. ఇతరులు 2 నుంచి 5 స్థానాల్లో గెలుస్తారని అంచనా. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 68 స్థానాలు గెలిచింది. బీజేపీ 15, ఇతరులు 7 స్థానాల్లో నెగ్గారు.
మిజోరం
మొత్తం అసెంబ్లీ సీట్లు 40. ఎంఎన్ఎఫ్ పార్టీకి 17 నుంచి 21 సీట్లు దక్కే అవకాశం. కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 10 స్థానాలు, జెడ్ పీఎం పార్టీకి 10 నుంచి 14 స్థానాలు, ఇతరులు 2 స్థానాలు దక్కించుకునే అవకాశం. గత ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ కు 5, జెడ్ పీఎం పార్టీకి 8, ఇతరులకు 1 స్థానం లభించాయి.