Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎల్బీ స్టేడియం ఆశీర్వాదంతో ప్రధానిని అయ్యా… ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని చేసుకుందాం: నరేంద్రమోదీ

  • బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్న ప్రధాని మోదీ
  • తెలంగాణకు ఇప్పుడు ఎల్బీ స్టేడియం సాక్షిగా బీసీ సీఎం వస్తున్నారని ధీమా
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో మూడు అంశాలు కామన్‌గా ఉన్నాయన్న మోదీ
  • బీసీ, ఎస్టీ, ఎస్టీల ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహం
  • బీఆర్ఎస్ నేతలకు లిక్కర్ స్కాంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణ
  • అవినీతికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని వ్యాఖ్య
  • నియామక పరీక్షలలో అవకతవకలు ఇక్కడ కామన్ అయ్యాయని విమర్శలు

బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎల్బీ స్టేడియంతో తనకు అనుబంధం ఉందని, పదేళ్ల క్రితం ఈ స్టేడియంలో ప్రజలు ఆశీర్వదించడంతో తాను ప్రధానిని అయ్యానని వ్యాఖ్యానించారు. ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నారు. నాటి నా సభలో ప్రసంగం కోసం టిక్కెట్ పెట్టారని, దేశంలోనే ఇదో కొత్త ప్రయోగం అన్నారు. 

తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ అది నెరవేరలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇలాంటి వారిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారన్నారు. అదే సమయంలో అబ్దుల్ కలాంను, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతిని చేసింది తామే అన్నారు. లోక్ సభలో తొలి దళిత స్పీకర్ బాలయోగిని చేసింది కూడా బీజేపీయే అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో మూడు అంశాలు కామన్‌గా ఉన్నాయన్నారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు ఆ రెండు పార్టీల లక్షణాలు అని విమర్శించారు. కాంగ్రెస్… బీఆర్ఎస్ సీ టీమ్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరు కాదని గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది బీజేపీయే అన్నారు. బీసీల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పారు. బీసీలకు ఏడాదికి రూ.1000 కోట్ల ఫండ్స్ ఇస్తామని బీఆర్ఎస్ చెప్పింది కానీ చేయలేదన్నారు. కేంద్ర కేబినెట్లో అత్యధిక బీసీలు కేంద్రమంత్రులుగా ఉన్నారన్నారు. ఓబీసీలకు చెందిన ఎక్కువ మందికి ఎంపీలుగా బీజేపీ అవకాశమిచ్చిందన్నారు. తెలంగాణలో ఈసారి బీజేపీని గెలిపించి బీసీని సీఎంగా చేసుకోవాలన్నారు. 

2019 లోక్ సభ ఎన్నికల్లోనే బీఆర్ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందన్నారు. ఆ పార్టీ నేతలకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.  తెలంగాణలో అవినీతిని అంతం చేస్తాం… ఇది మోదీ ఇచ్చే గ్యారెంటీ అన్నారు. లిక్కర్ స్కాం కేసును దర్యాఫ్తు చేస్తుంటే ఇక్కడి నేతలు సీబీఐ, ఈడీని తిడుతున్నారన్నారు. అవినీతి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారి నుంచి తిరిగి రాబడతామన్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ బీఆర్ఎస్ వైఫల్యం అన్నారు. అన్ని నియామక పరీక్షలలో అవకతవకలు ఇక్కడ కామన్ అయ్యాయన్నారు. తెలంగాణకు మోసం చేసిన బీఆర్ఎస్‌ను సాగనంపాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఒక తరం భవిష్యత్తును నాశనం చేసిందన్నారు. తెలంగాణ యువతను మోసం చేసిన బీఆర్ఎస్‌ను సాగనంపాలా? లేదా? అన్నారు. తాను ఢంకా బజాయించి చెబుతున్నానని బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు.

బీసీ యువతకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదన్నారు. బీసీలకు రూ.1 లక్ష ఇస్తామని మోసం చేసిందన్నారు. తాము మాత్రం మెడికల్, డెంటల్ సీట్లలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. టీచర్ పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఇచ్చే రేషన్‌ను మరో అయిదేళ్లు పొడిగించినట్లు చెప్పారు.

మోదీ నోట తెలుగు మాటలు….

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభలో సమ్మక్క సారలమ్మ… యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని తలుచుకున్నారు. ప్రసంగం సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే పదాల్ని తెలుగులో పలికారు. నా కుటుంబ సభ్యులారా.. అంటూ పలుమార్లు పలికి అందరినీ అలరించారు. పుణ్యభూమి తెలంగాణకు ప్రమాణాలు అని వ్యాఖ్యానించారు.

Related posts

కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయిందా … ? అతి చేస్తుందా …?

Ram Narayana

పట్టభద్రుల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి …పార్టీ నేతలకు రేవంత్ ఆదేశం…

Ram Narayana

ఖమ్మం జిల్లాలో 7 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ …!

Ram Narayana

Leave a Comment