లక్ష్మి దేవిపల్లి మార్కెట్ యార్డు నుండి ప్రదర్శన
తరలి రావాలని శ్రేణులకు పిలుపు
హాజరుకానున్న నారాయణ
సిపిఎం, కాంగ్రెస్ ఇతర ప్రజా సంఘాలు బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా, పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బుధవారం నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్, సిపిఐ ఒప్పందంలో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సిపిఐకి కేటాయించిన విషయం విధితమే. సిపిఐ రాష్ట్ర సమితి కూనంనేని ని అభ్యర్థిగా ప్రకటించారు. నామినేషన్ ను పురస్కరించుకుని లక్ష్మి దేవిపల్లి మార్కెట్ యార్డు నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబీర్ పాషా తెలిపారు.
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూనంనేని ప్రస్థానం పాత్రికేయునిగా ప్రారంభమైంది. విశాలాంధ్ర హైదరాబాద్ లో ఆయన సబ్ ఎడిటర్ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1980 దశకంలో కొత్తగూడెంలో విశాలాంధ్ర విలేకరిగా పనిచేసేందుకు వచ్చిన ఆయన అత్యంత చురుకుగా వ్యవహరిస్తూ అనతి కాలంలోనే సమస్యలపై అవగాహన పెంచుకుని ఆయన రాసిన వార్తలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశలయ్యాయి. పార్టీ సభ్యునిగా అత్యంత క్రీయాశీలకంగా వ్యవహరించిన కూనంనేని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1987లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో కొత్త గూడెం మండల తొలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన ఎన్నిక ఒక చారిత్రిక అంశంగా చెప్పుకున్నారు. ఆయన మండలాధ్యక్షునిగా ఉన్న సమయంలో రామాంజనేయ కాలనీ సహా పలు కాలనీలను నిర్మించారు. కొత్తగూడెం పట్టణ విస్తృతికి కృషి చేశారు. జిల్లా పరిషత్ సమావేశంలో తనదైన బాణిలో సాంబశివరావు సమస్యలను ప్రస్తావించి పలువురి ప్రశంసలు పొందారు. 1999, 2004 ఎన్నికల్లో సుజాత నగర్ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి చవి చూశారు. 2009లో కొత్తగూడెం నుంచి అప్పటి మంత్రి వనమా వెంకటేశ్వరరావును ఓడించి శాసనసభకు ఎన్నికయ్యారు. శాసనసభలో సిపిఐ పక్ష ఉప నాయకునిగా పనిచేసిన కూనంనేని బయ్యారం సహా పలు సమస్యలను ప్రస్తావించి ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బయ్యారం ఐరన్ ఓర్ పోరాటం సెగ కేంద్రాన్ని తాకిన విషయం ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. 2014లో ఓటమి చెందిన కూనంనేని 2018 ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ మధ్య అవగాహన ఉండడంతో కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేశారు. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ ఒప్పందంలో భాగంగా సిపిఐకి కొత్తగూడెం స్థానం కేటాయించడంతో కూనంనేని బుధవారం నామినేషన్ వేయనున్నారు.
పట్టణ కార్యదర్శి నుంచి రాష్ట్ర కార్యదర్శి దాకా :
సాధారణ సభ్యునిగా కమ్యూనిస్టు పార్టీలో చేరిన కూనంనేని కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షునిగా కూనంనేని పని చేస్తూ రైతాంగ సమస్యలపై అనేక ఆందోళనలు నిర్వహించడంతో పాటు అప్పట్లో ఆయన రైతాంగ సమస్యలపై రాసిన వ్యాసాలు పలువురిని ఆకట్టుకునేవి. 2004లో సిపిఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2009లో శాసనసభకు ఎన్నిక కావడంతో. కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. 2018లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన కూసంనేని 2020, 2022లో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జాతీయ సమితి సభ్యులుగా, రాష్ట్ర కార్యదర్శిగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా పని చేస్తున్నారు.
నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్న ప్రముఖులు :
కొత్తగూడెంలో బుధవారం జరగనున్న కూనంనేని సాంబశివరావు నామినేషన్ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, నాగా సీతారాములు, సిపిఐ నాయకులు పోటు ప్రసాద్, బి. అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్,సిపిఎం నాయకులు కనకయ్యతో పాటు టిజెఎస్ ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు హాజరు కానున్నారు.