- కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న రామ్మోహన్ రెడ్డి
- ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించబోతున్నారని వ్యాఖ్య
- పరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రామ్మోహన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో యువత… రేవంత్ రెడ్డికి బాసటగా నిలుస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌తో రేవంత్ చేస్తున్న పోరాటం పట్ల ప్రజలు, యువత ఆకర్షితులవుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రామ్మోహన్ రెడ్డి పరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పరిగి నియోజకవర్గంలో తాను ఎన్నో గ్రామాలను తిరిగానని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే బాగుండెనని ప్రజలు తనతో చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే, ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లు ఏమీ ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ చేసే రుణమాఫీ వడ్డీలకే సరిపోతుందన్నారు. ఆరు పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ ఇస్తామన్నారు. పెన్షన్ పెంచుతామన్నారు. రేవంత్ కాబోయే ముఖ్యమంత్రి అన్నారు. మన జిల్లా నుంచి సీఎం అయితే జిల్లాకు ఎక్కువ పదవులు వస్తాయని, ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని వికారాబాద్ జిల్లా ప్రజలు భావిస్తున్నారన్నారు.