Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి పవన్ కల్యాణ్ తప్పు చేశారు: చింతా మోహన్

  • తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న చింతా మోహన్
  • మజ్లిస్ పార్టీని పాతబస్తీ ముస్లింలే వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్య 
  • ఎస్సీ వర్గీకరణ అంశం కోర్టు పరిధిలో ఉందన్న చింతా మోహన్
  • విజయవాడ దళితుడు చక్రయ్యను తొలి రాష్ట్రపతి చేయాలని గాంధీ భావించారన్న చింతా మోహన్ 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తెలంగాణలో మాదిగలను మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కులాలకు అతీతంగా … పేదరికాన్ని కొలమానంగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీని పాతబస్తీ ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు.

అధికారం కోసం ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లను బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం నిర్ణయిస్తుందన్నారు. హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం తనకు నచ్చలేదని, కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఏమి చేయలేదన్న మోదీ మాటలు బాధించాయన్నారు. కృష్ణా జిల్లా ఎస్సీల వల్లే మహాత్మాగాంధీకి దక్షిణాఫ్రికాలో గుర్తింపు వచ్చిందన్నారు. దేశంలో అంటరానితనం ఉందని మహాత్ముడికి తెలిపింది ఎస్సీలే అన్నారు. స్వాతంత్ర్యం, అంటరానితనం నిర్మూలన గురించి గాంధీ పోరాడారని, ఒకప్పటి ఎస్సీలు కాంగ్రెస్ వల్ల ఇప్పుడు దళితులు అయ్యారన్నారు. నెహ్రు, అంబేద్కర్‌కు మంచి సంబంధాలు ఉండేవని, అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్త కావడానికి కాంగ్రెస్ కారణమన్నారు. రాజ్యాంగ రూపకర్తగా రెండుసార్లు అంబేద్కర్ రాజీనామా చేస్తే దాన్ని నెహ్రు తిరస్కరించినట్లు చెప్పారు.

విజయవాడకి చెందిన దళితుడు చక్రయ్యను దేశానికి తొలి రాష్ట్రపతిని చేయాలని గాంధీ భావించారని, కానీ ఆయన చనిపోవడంతో అది జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు బీజేపీ ఏమీ చేయలేదని మండిపడ్డారు. అదానీ, అంబానీలకే ప్రధాని చేస్తున్నారన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో దళితుల్లో అనేక వర్గాలు ఉన్నాయని, ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారో చెప్పాలన్నారు. ఓట్ల కోసం మోదీ చేస్తున్న ప్రసంగాలను ఖండిస్తున్నానన్నారు. ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చిందని తెలిపారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి తప్పు చేశారన్నారు. రెండు పార్టీలకు కలిపి ఐదు సీట్లకు మించిరావన్నారు. తెలంగాణలో ఎన్టీఆర్ పోటీ చేసినా గెలవడన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నప్పటికీ, తమ పార్టీ నేతలే ప్రజల వద్దకు వెళ్లి అడగడం లేదన్నారు. జగన్ పాలన బాగుంటుందని తాను భావించానని, కానీ ఆయన డీలా పడ్డారన్నారు.

Related posts

బాలకృష్ణ చర్చిస్తున్నారు: తెలంగాణలో టీడీపీ పోటీపై అచ్చెన్నాయుడు స్పందన

Ram Narayana

చంద్రబాబును కలిసిన తర్వాత వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు!

Ram Narayana

ప్రియమైన చంద్రబాబు మామయ్యకి… అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

Ram Narayana

Leave a Comment