- బీజేపీ నాయకులు కొన్ని రోజులు హడావుడి చేసి.. ఇప్పుడు బీఆర్ఎస్ గెలుపు కోసం పని చేస్తున్నారని ఆరోపణ
- కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ లక్ష్యమన్న రాహుల్ గాంధీ
- ప్రజల తెలంగాణ కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని వ్యాఖ్య
- హైదరాబాద్ ఐటీ కారిడార్‌గా మారింది కాంగ్రెస్ వల్లేనని వెల్లడి
తెలంగాణలో బీజేపీ నాయకులు కొన్నిరోజులు హడావుడి చేశారని, ఇప్పుడు మాత్రం చప్పుడు చేయకుండా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్ రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఒకరు ఢిల్లీలో, ఇంకొకరు హైదరాబాద్‌లో పని చేస్తున్నారన్నారు. ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయన్నారు. కొన్ని రోజులు హడావుడి చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ గెలుపు కోసం పని చేస్తున్నారన్నారు. లోక్ సభలో ఈ రెండు పార్టీలు కలిసిమెలిసి ఉండటం గమనించినట్లు చెప్పారు. కేంద్రంలోని అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు. ఇక మజ్లిస్… బీజేపీకి అనుకూలంగా అభ్యర్థులను నిలబెడుతుందని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై సంతకం పెడతామన్నారు.
ప్రజల తెలంగాణ కోసమే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. కానీ తెలంగాణ సంపద అంతా ఒకే కుటుంబానికి చేరిందన్నారు. తాను తన కళ్లతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా చూశానని, కానీ ఒక లక్ష కోట్ల రూపాయల తెలంగాణ ప్రజా ధనాన్ని కేసీఆర్ తన ఇంట్లో వేసుకున్నట్లుగా కనిపించిందన్నారు. అక్కడ పిల్లర్లు కూలిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతికి కాళేశ్వరం పరాకాష్ఠ అన్నారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ హామీని నెరవేర్చుకోలేదన్నారు. ధరణి ద్వారా లక్షలాది మందికి నష్టం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతుంటారని… కానీ ఆయన చదువుకున్న స్కూల్, కాలేజీ కాంగ్రెస్ పార్టీయే నిర్మించిందన్నారు.
హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ ఐటీ కారిడార్‌గా నిలిచిందని, దీనికి కారణం కాంగ్రెస్ అన్నారు. మీకు మేం ఆరు హామీలు ఇచ్చామని, అధికారంలోకి రాగానే వాటిని నెరవేరుస్తామన్నారు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఆ రాష్ట్రంలో ప్రతి పైసా పేదలకే వెళ్తుందని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారికే వెళ్తుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కొంతమందికి మాత్రమే ఉపాధి కల్పిస్తారని, కానీ కాంగ్రెస్ పేదల కోసం చూస్తుందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. వెనుకబాటుకు గురైన కులాలకు అందుకు అనుగుణంగా బడ్జెట్‌ను కేటాయిస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు.