- ‘ఆల్ క్యాష్ డీల్’లో భాగంగా దక్కించుకున్న ముంబై
- రిటెన్సన్ గడువు ముగిసినా డిసెంబర్ 12 వరకు ఆటగాళ్ల కొనుగోలుకు అవకాశం
- చెల్లుబాటు కానున్న జట్ల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్
- ఈ మార్గంలోనే పాండ్యా దక్కించుకున్న ముంబై ఫ్రాంచైజీ
టీమిండియా స్టార్ ఆల్-రౌండర్ హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తరపున ఆడడం ఖరారైంది. పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ విజయవంతంగా దక్కించుకుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం గుజరాత్ టైటాన్స్ ప్రకటించిన అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల (రిటెన్సన్ ప్లేయర్స్) జాబితాలో హార్ధిక్ పేరు కనిపించింది. అయినప్పటికీ అతడిని ముంబై ఇండియన్స్ ఏవిధంగా దక్కించుకుందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముంబై ఏవిధంగా దక్కించుకుందనేది ఆసక్తికరంగా మారింది.
‘ఆల్ క్యాష్ డీల్’లో భాగంగా గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యాను ముంబై కొనుగోలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిటెన్సన్ గడువు నవంబర్ 26న ముగిసినప్పటికీ డిసెంబర్ 12 వరకు ఆటగాళ్లను కొనుగోలు చేసే వీలుంటుంది. ఈ మార్గంలోనే పాండ్యాను ముంబై దక్కించుకుంది. ఈ ప్రక్రియలో రెండు జట్ల మధ్య నగదు ఒప్పందం జరుగుతుంది. జట్ల మధ్య ఆటగాళ్లకు సంబంధించిన లావాదేవీలు చెల్లుబాటు అవుతాయి.
ఇదిలావుండగా హార్ధిక్ పాండ్యా ముంబైకి ఆడబోతున్నాడని ముందు నుంచే రిపోర్టులు వెలువడ్డాయి. గుజరాత్ టైటాన్స్ రిటెన్సన్ ప్లేయర్ల జాబితాలో పాండ్యా పేరు కనిపించడంతో ఇవన్నీ ఊహాగానాలేనని క్రికెట్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ పాండ్యాను ముంబై దక్కించుకుందని తర్వాత వెల్లడైంది. కాగా హార్ధిక్ పాండ్యా 2022, 2023 సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను టైటిల్ విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా ఆ జట్టు ఫైనల్‌కు వచ్చి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఫైనల్‌కు వారిని నడిపించాడు, అక్కడ వారు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓడిపోయారు. కాగా ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది.