- నిధుల విడుదలకు అనుమతి రద్దు చేసిన ఈసీ
- రెండు రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైనం
- ఎన్నికల ప్రచారంలో రైతుబంధును ప్రస్తావించవద్దని షరతు
- ఈ నిబంధనను ఉల్లంఘించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. రైతుబంధు నిధుల విడుదలకు ఇప్పటికే ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ నిబంధనలను మంత్రి హరీశ్ రావు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం రైతుబంధు విషయంలో రెండు రోజుల క్రితం ఈసీ సానుకూల నిర్ణయం వెలువరించింది. రైతుబంధు నిధులు విడుదల చేయడానికి అనుమతినిచ్చింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉందని గుర్తుచేస్తూ.. రైతుబంధు నిధుల విడుదల అంశాన్ని ప్రచారంలో ప్రస్తావించ వద్దని షరతు విధించింది. ఈ పథకం పేరును ప్రస్తావిస్తూ ఎన్నికల్లో లబ్ది పొందే వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొంది. ఈసీ అనుమతించడంతో ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే, ఈసీ తాజా ఆదేశాల కారణంగా నిధుల విడుదల మరింత ఆలస్యం కానుంది.
ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాలకు మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్ రావు రైతుబంధు నిధుల విడుదల అంశాన్ని ప్రస్తావించారు. మంత్రి మాటలను మీడియా ఆదివారం హైలైట్ చేసింది. దీనిపై ఫిర్యాదులు అందడంతో రైతుబంధు నిధులను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
రైతుబంధు పంపిణీకి అనుమతివ్వాలని ఈసీకి బీఆర్ఎస్ మరోసారి విజ్ఞప్తి
- 28వ తేదీ లోపు రైతుబంధు పంపిణీ చేయాలని ఆదేశించిన ఈసీ
- రైతుబంధు గురించి ప్రస్తావించవద్దని షరతు
- హరీశ్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో అనుమతి ఉపసంహరించుకున్న ఈసీ
- తాజా నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి
రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ మరోసారి విజ్ఞప్తి చేసింది. తొలుత రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మరోసారి ఈసీని ఆశ్రయించింది. అనుమతిని నిరాకరిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరింది.
ఈ నెల 28వ తేదీలోపు రైతుబంధు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో రైతుబంధు గురించి ఎక్కడా ప్రస్తావించరాదని ఈసీ షరతులు విధించింది. ఈ పథకం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. అయితే రైతుబంధుపై మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు చేయడంతో ఈసీ అనుమతిని నిరాకరించింది. దీంతో బీఆర్ఎస్ ఈసీ వద్దకు మరోసారి వెళ్లింది.