- పూలరథంపై సోనియాతో కలిసి వేదిక వద్దకు
- వేదికపై ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సహా సీనియర్ నేతలు
- రేవంత్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్
Listen to the audio version of this article
‘ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని..’ చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన ఎల్బీ స్టేడియంలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం కొలువుదీరింది.
అంతకుముందు, సోనియా గాంధీతో కలిసి పూల వాహనంపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్, ప్రియాంక, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను వేదికపైకి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు రేవంత్ రెడ్డి స్వాగతం పలికి, వేదికపైకి తోడ్కుని వచ్చారు.
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ హామీ
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇంగ్లీష్, తెలుగు భాషలలో ప్రధాని ట్వీట్ చేశారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎల్బీ స్టేడియంకు తరలి వచ్చారు.