- రేపు ఉదయం ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న అక్బరుద్దీన్
- ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్
- పదిన్నర గంటలకు ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్న అక్బరుద్దీన్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు రేపు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు మజ్లిస్ పార్టీ నుంచి గెలిచిన అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా రాజభవన్‌లో ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించి… స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి.
సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ప్రస్తుతం కేసీఆర్ అత్యధికంగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అక్బరుద్దీన్ ఆరుసార్ల చొప్పున గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారు.