కేసీఆర్ కోలుకుంటున్నారు.. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరాను: రేవంత్ రెడ్డి
- యశోదా ఆసుపత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి
- మంచి పాలన కోసం కేసీఆర్ సూచనలు అవసరమన్న రేవంత్
- ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉందన్న సీఎం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కలిశారు. ఆయనను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ ను పరామర్శించానని తెలిపారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు.
కేసీఆర్ ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించానని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో మంచి పాలన అందించడానికి… ఆయన సూచనలు కూడా అవసరం అని అన్నారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్ ను కోరానని తెలిపారు.
యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
- షబ్బీర్ అలీ, సీతక్కతో కలిసి ఆసుపత్రికి రేవంత్
- వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
- వేగంగా కోలుకుంటున్నారన్న వైద్యులు
ఎర్రవల్లి ఫాంహౌస్ బాత్రూంలో జారిపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రేవంత్‌రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు.
కేసీఆర్‌కు శుక్రవారం రాత్రి వైద్యులు తుంటి మార్పిడి ఆపరేషన్ చేశారు. నిన్న వాకర్ సాయంతో కేసీఆర్‌ను వైద్యులు నడిపించారు. కేసీఆర్ కోలుకునేందుకు ఆరు నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నట్టు చెప్పారు.