Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

సజ్జనార్ పై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు …

సజ్జనార్… మీ ప్రతాపం బిగ్ బాస్ యాజమాన్యంపైనా, అక్కినేని నాగార్జునపైనా చూపండి

  • ముగిసిన బిగ్ బాస్ సీజన్-7
  • విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్… రన్నరప్ గా అమర్ దీప్
  • అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్ అభిమానులు, అమర్ దీప్ అభిమానుల మధ్య ఘర్షణ
  • ఆర్టీసీ బస్సులపై దాడి… కేసు పెట్టిన ఆర్టీసీ అధికారులు

బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన అనంతరం హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ చౌదరి అభిమానుల మధ్య ఘర్షణ జరగడం తెలిసిందే. 

ఈ గొడవల్లో కొందరు అభిమానులు ఆర్టీసీ బస్సులపై దాడి చేయడాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్టేనని సజ్జనార్ వ్యాఖ్యానించారు. అభిమానం పేరుతో పిచ్చి చేష్టలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. 

అయితే, సజ్జనార్ వ్యాఖ్యల పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా స్పందించారు. సజ్జనార్… బిగ్ బాస్ షో ముందు కొట్లాడుకున్న యువకులపై కాదు… బిగ్ బాస్ యాజమాన్యంపై, అక్కినేని నాగార్జునపై చూపండి మీ ప్రతాపం అంటూ వ్యాఖ్యానించారు. 

“ఈరోజు బిగ్ బాస్ షో ముందు కుర్రాళ్లు కొట్టుకున్నారు…. పెద్ద గొడవ జరిగింది. ఆర్టీసీ బస్సులు చెడగొడతారా అంటూ సజ్జనార్ లాంటి వాళ్లు వచ్చి కేసులు పెడుతున్నారు. నేను సూటిగా అడిగేది ఏంటంటే… ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకం. అలాంటి షోకి అనుమతి ఇవ్వడం కరెక్ట్ కాదు. అందులో ఏదో ప్రైజ్ వచ్చిందని, వారు కొట్లాడుకున్నారని, బస్సులపై దాడి చేశారని సజ్జనార్ కేసు పెడుతున్నారు. 

నేను సూటిగా అడుగుతున్నా… ఇదే సజ్జనార్ గతంలో సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు నేను బిగ్ బాస్ షోపై ఫిర్యాదు చేస్తే… మూడ్రోజులు ఆ ఫిర్యాదును అలాగే పెట్టుకుని, ఆ తర్వాత నా వల్ల కాదు, కోర్టుకు వెళ్లమని చెప్పారు. నేను కింది కోర్టుకు వెళితే వారు పై కోర్టుకు వెళ్లమన్నారు, పై కోర్టుకు వెళితే జిల్లా కోర్టుకు వెళ్లమని చెప్పారు. 

బిగ్ బాస్ షోపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు భయపడుతున్నారు, కోర్టులు కూడా భయపడుతున్నాయి… ఏం… బిగ్ బాస్ అంతటి ఆదర్శవంతమైన కార్యక్రమమా… బిగ్ బాస్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, నీచాతినీచమైన కార్యక్రమాలకు బిగ్ బాస్ వేదికగా ఉంది. నాగార్జున వంటి వారు డబ్బుకు కక్కుర్తిపడి ఆ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. 

బీజేపీ ఒకవైపు భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతుంటుంది… ఈ బిగ్ బాస్ కార్యక్రమం ఏమైనా భారతీయ సంస్కృతిలో భాగమా? పాశ్చాత్య సంస్కృతిని ఇక్కడికి తీసుకువచ్చి, ఒక వంద మందిని తీసుకెళ్లి ఒక ఇంట్లో పడేసి, దాన్నొక **** కొంపలా తయారుచేసి, దాన్లో వచ్చే గొడవలు చూపిస్తున్నారు. 

ఈసారి ఒక రైతు బిడ్డను తీసుకువచ్చి అతడికి లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లోని వారు సరిగా చూడకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారిని ఆకర్షించడం కోసమే ఇలా చేశారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా…. రైతు బిడ్డను తీసుకువచ్చి అతడికి ఓ ప్రైజ్ ఇచ్చి, బయటేమో కొట్లాట పెట్టారు. 

ఇదంతా బిగ్ బాస్ షో యాజమాన్యం ఆడుతున్న నాటకం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకాన్ని కూడా ప్రేక్షకులుగా మార్చేందుకు చేసిన కుట్ర తప్ప మరొకటి కాదు. ఈ షోని తక్షణమే నిషేధించాలని కోరుతున్నాం” అని నారాయణ స్పష్టం చేశారు.

Related posts

నిమ్మగడ్డను కీలక పదవి …

Ram Narayana

తెలంగాణ, ఏపీ రాజకీయాలపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

Ram Narayana

ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలో సినీ పాత్రికేయులకు విశిష్ట సత్కారం..

Ram Narayana

Leave a Comment