- పంట ఉత్పత్తులను సకాలంలో సేకరించి రైతులకు అండగా నిలబడాలని సూచించిన మంత్రి తుమ్మల
- ఎరువుల సరఫరా, పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై అధికారుల నుంచి ఆరా తీసిన మంత్రి
- ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని పంట ఉత్పత్తుల డిమాండ్లను అధ్యయనం చేయాలని ఆదేశం
యూరియా వినియోగం తగ్గించే విధంగా రైతులకు అవగాహన కార్యక్రమాలను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. శుక్రవారం తెలంగాణ మార్క్ ఫెడ్ కార్యకలాపాలపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మార్క్ ఫెడ్ జనరల్ మేనేజర్, మేనేజర్ ప్రొక్యూర్మెంట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పంట ఉత్పత్తులను సకాలంలో రైతుల నుంచి సేకరించి రైతులకు అండగా నిలబడాలని సూచించారు. ఎరువుల సరఫరా, పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై మంత్రి… అధికారుల నుంచి ఆరా తీశారు. రైతులకు మద్దతు ధర వివరాలను తెలుసుకున్నారు.
ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని పంట ఉత్పత్తుల డిమాండ్లను అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల మార్క్ ఫెడ్ నిర్వహించే కార్యకలాపాలను తెలుసుకొని విధానాలు రూపకల్పన చేయాలన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉండేవిధంగా చూడాలన్నారు. మార్క్ ఫెడ్ చేపట్టే అన్ని కార్యకలాపాలు రైతులకు అండగా ఉండేలా ఉపయోగపడాలన్నారు. సంస్థ నష్టాలను తగ్గించుకొని లాభాలను గడించే విధంగా సంస్థ చర్యలు తీసుకోవాలన్నారు.