- న్యూయార్క్ టైమ్స్ కథనంలో వెల్లడి
- జింజియాన్ ప్రావిన్స్‌లోని లోప్ నూర్ అణుపరీక్ష కేంద్రం ఆధునికీకరణ
- భద్రతా వ్యవస్థల ఏర్పాటు, కొండల్లో సొరంగాల నిర్మాణం
- కొత్త తరం మిసైళ్లకు అధునాతన అణువార్ హెడ్స్ అమర్చి పరీక్షలు
చైనా అణుబాంబు పరీక్షలకు సిద్ధమవుతోందన్న వార్త ప్రస్తుతం అంతర్జాతీయంగా కలవరం రేపుతోంది. జింజియాన్ ప్రావిన్స్‌లోని లోప్ నూర్ అణు పరీక్షా కేంద్రంలో మళ్లీ కార్యక్రమాలు ప్రారంభమవటమే దీనికి కారణం. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించడం సంచలనంగా మారింది. కొత్త తరం బాలిస్టిక్ మిసైల్స్‌కు అమర్చిన నూతన వార్ హెడ్స్‌ను పరీక్షించేందుకు చైనా రెడీ అవుతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. రసాయనిక బాంబులతో సబ్‌క్రిటికల్ టెక్నాలజీలను కూడా చైనా పరీక్షించబోతున్నట్టు పేర్కొంది. ఈ దిశగా కొండల్లో భారీ సొరంగాలు కూడా తవ్వుతున్నట్టు పేర్కొంది.
అంతర్జాతీయ నిపుణుల నివేదికలు, శాటిలైట్ చిత్రాలను న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. గత కొన్నేళ్లుగా లోప్ నూర్ కేంద్రం అణుపరీక్షలకు అనువైన నిర్మాణాలు చేపడుతున్నట్టు ఈ చిత్రాల్లో స్పష్టమైందని పేర్కొంది. పురాతన భవన సముదాయమైన లోప్ నూర్ కేంద్రం 2017 నాటికే అత్యాధునిక వసతులను సంతరించుకుందని వెల్లడించింది. కేంద్రంలో అత్యాధునిక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. చైనాతో సఖ్యత కోసం అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ కథనం అగ్రరాజ్యంలో కలకలానికి దారి తీసింది.