- ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
- రెండు గ్రూపుల మధ్య ఘర్షణలో పేలిన తుపాకీ
- ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న విషాదకర ఘటన

అగ్రరాజ్యం అమెరికాలో క్రిస్మస్ పండగ వేళ కూడా కాల్పులు జరిగాయి. కొలరాడోలోని ఒక మాల్‌లో ఆదివారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ షాపింగ్ సందడిలో బిజీగా ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిగాయి. ఒక ఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణలో భాగంగా ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని, ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలీసు అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని, తీవ్రంగా గాయపడిన బాధితులను తక్షణమే హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు.
‘సిటాడెల్ మాల్’ వద్ద ఈ కాల్పులు ఘటన జరిగిందని, ఒక వ్యక్తి చనిపోయినట్లు గుర్తించామని కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలీసు అధికారులు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారిలో ఓ మహిళ ఉందని, ఈ కాల్పుల ఘటనతో సంబంధమున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగిందని, ఈ ఘటనలో ఓ యువకుడు చనిపోయినట్టు తెలిపారు. మరోవైపు శనివారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని ఓకాలా వద్ద ఓ మాల్ వద్ద కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా ఒక మహిళ గాయపడినట్లు ఓకాలా పోలీస్ చీఫ్ మైక్ బాల్కెన్ వెల్లడించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: