- వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల
- దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అంటూ వ్యాఖ్య
- వైఎస్సార్ కూతురుగా కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని హర్షం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్సార్ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరిక్షణం వరకూ పార్టీకి సేవ చేశారని గుర్తుచేశారు. ఆయన కూతురుగా ఈ రోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈరోజు దేశంలోనే అతిపెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు.
ఇటీవల మణిపూర్ లో జరిగిన అల్లర్లు, ప్రాణనష్టం తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. అందుకే తను కాంగ్రెస్ లో చేరానని, తన పార్టీ వైఎస్సార్ టీపీని విలీనం చేశానని వివరించారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ టీపీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన తండ్రి వైఎస్సార్ కల అని, ఆ కలను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల వివరించారు.