ఓటుకు నోటు కేసులో అణిచివేయాలని చూస్తే.. ముఖ్యమంత్రిగా ఆయన ముందు నిలబడ్డాను… రేవంత్ రెడ్డి
- తాను ఆసుపత్రిలో బాధ్యతాయుతంగానే కేసీఆర్‌ను పరామర్శించానన్న రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తాను వంద శాతం నమ్మానని వ్యాఖ్య
- జిల్లాల విభజనపై అందరి అభిప్రాయాలు తీసుకొని.. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం ఉంటుందని స్పష్టీకరణ
ఓటుకు నోటు కేసు ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను ఎన్ని రకాలుగా అణిచివేయాలని చూసినా ఈ రోజు ఆయన ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డానని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక ప్రవేట్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు .. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తాను మాజీ సీఎం కేసీఆర్‌ను బాధ్యతాయుతంగానే ఆసుపత్రిలో పరామర్శించానని స్పష్టం చేశారు. ఆయనను సవాల్ చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిలా తాను ప్రవర్తించలేదన్నారు. తాను మర్యాదపూర్వకంగానే పరామర్శించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తాను వంద శాతం నమ్మానని తెలిపారు. తాను కేంద్ర పెద్దల వద్దకు ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వెళ్లానని… దీనిని వారు మెచ్చుకున్నారని చెప్పారు.
జిల్లా విభజనపై రేవంత్ రెడ్డి
పాలనలో ఏ క్షణం ఏమరుపాటుగా ఉండవద్దని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. 33 జిల్లాల విభజన సరిగ్గా లేదని విమర్శించారు. జిల్లాల విభజన వల్ల మన శక్తి, సామర్థ్యాలను తగ్గించుకున్నట్లు అయిందన్నారు. ఈ జిల్లాల విభజనపై తన ఇష్టానుసారం చేయలేనని.. అలా చేస్తే విమర్శలు వస్తాయన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిషన్ వేసి విభజన చేస్తే మేలు జరుగుతుందన్నారు. అప్పుడు నచ్చితే నజరానా.. లేదంటే జరిమానా అన్నట్లుగా విభజన జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలను పరిశీలించి.. అందరి అభిప్రాయాలను తీసుకొని శాస్త్రీయంగా జిల్లాల విభజన చేయాలన్నారు. ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం ఉంటుందన్నారు.
మా పార్టీ నాయకురాలు షర్మిల రావడంతో ఆలస్యంగా వచ్చాను!
- ప్రతిరోజు పరీక్షలకు ప్రిపేర్ అయి వెళ్తున్నట్లుగా పాలన కోసం వెళ్తున్నానని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రానికి తాను రెండో ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ముందే చెప్పానని, అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారంలోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
తాను ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చానని చెబుతూ.. అందుకు కారణం చెప్పారు. తాను బిగ్ డిబేట్ కార్యక్రమానికి ఏడు గంటలకే వద్దామనుకున్నానని… కానీ తమ పార్టీ నాయకురాలు షర్మిల తన ఇంటికి వచ్చి తన కొడుకు పెళ్లి పత్రికను అందించారని.. అందుకే కాస్త ఆలస్యమైందని చెప్పారు. కాంగ్రెస్ పాలన ఈ రోజుతో నెల రోజులు పూర్తి చేసుకుందన్నారు. జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆయా పదవులను బట్టి తన తీరులో మార్పు వస్తుందన్నారు. ఉదాహరణకు పీసీసీ చీఫ్‌గా తాను అగ్రెసివ్‌గా ఉండాలి కాబట్టి నిన్నటి వరకు అలా ఉన్నానని చెప్పారు. ప్రతిరోజు పరీక్షలకు ప్రిపేర్ అయి వెళ్తున్నట్లుగా ఇప్పుడు పాలన కోసం వెళ్తున్నానని చెప్పారు. కష్టపడుతూ.. తెలుసుకుంటూ.. నేర్చుకుంటూ పాలన చేస్తున్నానని చెప్పారు.
మోదీ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడరని గ్రహించాను.. రాష్ట్రం కోసమే కేంద్ర మంత్రులను కలుస్తున్నాను: బిగ్ డిబేట్‌లో రేవంత్ రెడ్డి
- గత పాలకుల తీరుతో మోదీ విసిగిపోయారన్న రేవంత్ రెడ్డి
- తెలంగాణకు సహకరిస్తామని రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అమిత్ షా హామీ ఇచ్చారన్న రేవంత్ రెడ్డి
- పార్టీ పరంగా బీజేపీపై పోరాడుతూ… తెలంగాణ కోసం కేంద్రం సహకారం తీసుకుంటానని స్పష్టీకరణ
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడదని తాను ఈ ముప్పై రోజుల్లో గ్రహించానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం కేంద్రం సహకారం కోసమే తాను కేంద్రమంత్రులను కలిసినట్లు చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షాను కలిస్తే ఆర్థిక సహకారం కోసం నిర్మలా సీతారామన్‌ను కలవమని చెప్పారన్నారు. తాను నిర్మలమ్మను కలిస్తే నిధుల విషయంలో సానుకూలంగా స్పందించారన్నారు. తనకు కొత్తగా అప్పులు వద్దని… గత ప్రభుత్వం 11 శాతానికి తీసుకున్న అప్పులను 2 శాతానికి మార్చమని కోరానని, దానికి ఆమె వెంటనే అధికారులను ఆదేశించారని చెప్పారు. అలాగే తెలంగాణకు సహకారం ఉంటుందని చెప్పారన్నారు.
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిస్తే అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారని.. తెలంగాణ సీఎంగా యంగ్ స్టర్‌గా తనకు అవకాశం వచ్చిందని మెచ్చుకున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శించేలా చేయగలిగానన్నారు. ప్రతీ దానినీ వారు రాజకీయ కోణంలో చూడరని తనకు ఈ ముప్పై రోజుల పాలనలో మాత్రం అర్థమైందన్నారు.
తాను పార్టీ పరంగా బీజేపీపై పోరాటం చేస్తానని.. అదే సమయంలో తెలంగాణ కోసం కేంద్రం సహకారం తీసుకుంటానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పడంపై ప్రశ్నించగా… సహకారం ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. అయితే ఇక్కడ గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రధాని మోదీ విసిగిపోయినట్లుగా తనకు కనిపించిందన్నారు. మోదీ ఇక్కడకు వచ్చినా కలవకపోవడం.. అక్కడకు వెళ్లి కలవకపోవడం చూశామన్నారు. కానీ నవీన్ పట్నాయక్ సీఎంగా ఉంటూనే కేంద్రంతో బాగా ఉంటారని గుర్తు చేశారు. తానూ అలా ఉంటానని అభిప్రాయపడ్డారు. తాను పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలపై చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ ముద్ర ఉంటుందని చెప్పారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించను.. వారు రంగస్థలం చేస్తే మాత్రం గేమ్ స్టార్ట్ చేస్తాం: బిగ్ డిబేట్‌లో రేవంత్ రెడ్డి…
- మాకు పూర్తి మెజార్టీ ఉంది.. తప్పుడు మార్గాలను ఎంచుకోనని స్పష్టీకరణ
- కేసీఆర్ ప్రజలిచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటారని భావిస్తున్నట్లుగా వెల్లడి
- కేసీఆర్ కొడుకు.. ఇతరులు ఫిరాయింపులపై దూకుడుకా వెళ్తే అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామని వెల్లడి
తెలంగాణలో తమకు పూర్తి మెజారిటీ ఉందని… ఫిరాయింపులను ప్రోత్సహించే ఉద్దేశ్యం తనకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తప్పుడు మార్గాలను ఎంచుకోవాలని తాను చూడటం లేదన్నారు. కానీ ప్రతిపక్షం ఫిరాయింపుల గేమ్ స్టార్ట్ చేస్తే మాత్రం అందుకు తిగిన విధంగా తమ గేమ్ మారుతుందని తేల్చి చెప్పారు. అయినా అలాంటి చర్య తెలంగాణలో జరగదని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన తీర్పుకు కేసీఆర్ కట్టుబడి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు.
ఒకవేళ కేసీఆర్ కొడుకు.. ఇతరులు ఫిరాయింపుల అంశంపై దూకుడుగా వెళ్తే… రంగస్థలం తయారు చేస్తే అందుకు అనుగుణంగా తాము ముందుకు సాగుతామన్నారు. కేసీఆర్‌కు.. ఆయన కుటుంబానికి ఇష్టం ఉన్నా లేకపోయినా తాను ముఖ్యమంత్రిగా అయి ముప్పై రోజులు అయిందన్నారు. తాను ఇప్పటి వరకు బ్యాలెన్స్‌గానే ఉన్నానని… ఇక ముందు కూడా అలాగే వ్యవహరించానన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే మాత్రం రానున్న లోక్ సభ ఎన్నికల్లో వారు మా నెత్తిన వారు పాలు పోసినట్లే అన్నారు.
జగన్ ఏపీ రాజకీయాలతో సంబంధం లేదు.. కాబోయే అధ్యక్షురాలు షర్మిలకు సహకరిస్తా: రేవంత్ రెడ్డి
- జగన్.. నేను ప్రత్యర్థులమే కానీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వలెనే ఏపీ అని వ్యాఖ్య
- కాబోయే ఏపీ అధ్యక్షురాలు షర్మిలకు సహకరిస్తానని వెల్లడి
- చంద్రబాబు బీజేపీతో కలిస్తే ఎలా? అని అడగగా సంబంధం లేదన్న రేవంత్ రెడ్డి
రాజకీయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాము ప్రత్యర్థులమేనని.. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కావాలని జగన్ అనుకుంటే.. కాంగ్రెస్ గెలవాలని తాను కోరుకున్నానని, మోదీని ప్రధానిగా చేయాలని ఆయన కోరుకుంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తాము కోరుకుంటున్నామన్నారు. కాబట్టి జగన్‌కు మేం ప్రత్యర్థులమే అన్నారు.
కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. కర్ణాటక, తమిళనాడు రాజకీయాలు తనకు ఎలాగో… ఆంధ్రప్రదేశ్ రాజకీయాలూ అంతే అన్నారు. ఇతర రాష్ట్రాల రాజకీయాల విషయంలో తాను స్పందించడం లేదని.. అలాగే ఏపీ విషయంలోనూ అన్నారు. ఏపీలోను తమ పార్టీ నాయకులు ఉన్నారని.. వారు స్పందిస్తారన్నారు. విభజన అంశాలపై మాత్రం జగన్‌ను కలిసేందుకు తాను సిద్ధమని చెప్పారు.
షర్మిలకు అండగా ఉంటాను
షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కాబోతుందని తెలుస్తోందని.. అప్పుడు ఆమెకు అండగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు తామిద్దరం కలిసినప్పుడు కచ్చితంగా రాజకీయ చర్చ జరిగిందన్నారు. కాబోయే అధ్యక్షురాలిగా షర్మిలకు సహకరిస్తానని.. తమ మధ్య విబేధాలు సృష్టించవద్దని సూచించారు. కాబట్టి తెలంగాణ నుంచి పంపించడంలో విజయవంతమయ్యారని తనను అనవద్దని సూచించారు. రెండు రాష్ట్రాల విషయానికి వస్తే కేసీఆర్, జగన్ ఒకటేనని.. తాను, షర్మిల ఒకటి అన్నారు. చంద్రబాబుతో బీజేపీ కలిస్తే ఎలా? అనిప్రశ్నించగా.. ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉంది.. వారు స్పందిస్తారన్నారు.
‘రెండేళ్ల ముఖ్యమంత్రి’ అంటున్నారని అడగగా.. రేవంత్ రెడ్డి సమాధానం ఇదే!
- రెండేళ్లే ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలకు న్యాయం చేస్తానన్న రేవంత్ రెడ్డి
- నేను టీమ్ లీడర్‌ను మాత్రమే.. అందరి సహకారంతో ముందుకు సాగుతానని వెల్లడి
- రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కానన్న రేవంత్ రెడ్డి
తాను రెండేళ్లు లేదా మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలకు న్యాయం చేయడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీరు రెండేళ్లు లేదా మూడేళ్లే ముఖ్యమంత్రిగా ఉంటారనే చర్చ జరుగుతోంది కదా… అంటే … దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ… ఎన్నికలకు ముందు తానే ముఖ్యమంత్రినంటూ చాలామంది చెప్పుకున్నారని.. కానీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అయిందన్నారు. తాను కేవలం టీమ్ లీడర్‌ను మాత్రమేనని… తన కేబినెట్లోని మంత్రులంతా చాలా సీనియర్లు అని.. వారి సలహాలు.. సూచనలతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
తాను కేంద్ర మంత్రులను కలిసినా ఆ శాఖకు సంబంధించిన మంత్రితో కలిసి వెళ్తున్నానని గుర్తు చేశారు. వన్ మ్యాన్ షో చేయదలుచుకోలేదన్నారు. నేనే బ్యాటింగ్… నేనే ఫీల్డింగ్… నేనే బౌలింగ్ చేయలేనన్నారు. అందరితో కలిసి ముందుకు సాగుతానని చెప్పారు. ప్రచారం జరిగినట్లు తాను రెండేళ్లు సీఎంగా ఉన్నా.. మూడేళ్లు ఉన్నా ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. అంతకంటే సంతోషం ఏముంటుంది? అని ప్రశ్నించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఇప్పుడు సీఎం అంటే ఎవరెస్ట్ ఎక్కినట్లే అన్నారు.