- డిసెంబరు 28న వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు
- పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నిన్న ప్రకటన
- తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాయుడి వ్యవహారం
- గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వనందువల్లే రాజీనామా అంటూ కథనాలు
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరి రెండు వారాలు కూడా గడవకముందే రాయుడు పార్టీని వీడడం తీవ్ర చర్చకు దారితీసింది. గుంటూరు ఎంపీ సీటు ఇవ్వనందువల్లే రాయుడు వైసీపీని వదిలేశాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తెరదించేందుకు రాయుడు స్వయంగా రంగంలోకి దిగాడు.
“నేను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 పోటీల్లో పాల్గొంటున్నాను. జనవరి 20 నుంచి దుబాయ్ లో జరిగే ఈ పోటీల్లో నేను ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉంది” అంటూ రాయుడు ట్వీట్ చేశాడు.
క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామాపై తిరువూరు సభలో చంద్రబాబు వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో చంద్రబాబు స్పందించారు.
“అంబటి రాయుడు… ఓ క్రికెటర్. గుంటూరు జిల్లాకు చెందినవాడు. రాయుడు ఆశపడడంలో తప్పులేదు. కానీ జగన్ మాయగాడు. రాయుడ్ని నమ్మించి మోసం చేశాడు. రాయుడ్ని మాయ చేశాడు. నీకు గుంటూరు పార్లమెంటు స్థానం ఇచ్చేస్తాం… పోయి పని చేసుకో అని నమ్మబలికాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇంకొకరిని పిలిచి గుంటూరు స్థానం నీకిచ్చేస్తా అన్నాడు. ఆ పేరు నేను చెప్పను. దాంతో రాయుడికి విషయం అర్థమైపోయింది. ఆయన నైజం ఏంటో గుర్తించాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవడం ఖాయమని తెలుసుకుని… ఫీల్డ్ లోకి ఎంటర్ కాకముందే పారిపోయాడు” అంటూ చంద్రబాబు వివరించారు.