- -ప్రగతి భవన్ లో సర్వే ఏజెన్సీలతో సమావేశం
- -డిజిటల్ సర్వే తీరుతెన్నులపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
- -జూన్ 11 నుంచి పైలట్ ప్రాజెక్టు
- -తొలుత భూవివాదాల్లేని గ్రామాల్లో సర్వే
తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ డిజిటల్ సర్వేలో భాగంగా తొలుత జూన్ 11 నుంచి పైలట్ సర్వే చేపట్టనున్నారు. అందుకోసం గజ్వేల్ జిల్లా నుంచి 3 గ్రామాలు, మరో 24 జిల్లాల నుంచి 24 గ్రామాలను ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేడు సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను గుర్తించడం ద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలన్నది సర్కారు ఉద్దేశమని వివరించారు. పైలట్ సర్వేలో భాగంగా మొదట భూ వివాదాలు లేని గ్రామాల్లో డిజిటల్ సర్వే చేయాలని సూచించారు. ఆ తర్వాత అటవీభూములు, ప్రభుత్వ భూములు కలిసి ఉండే సమస్యలున్న, సమస్యలు లేని గ్రామాల్లో మిశ్రమంగా సర్వే చేపట్టాలని, తద్వారా క్షేత్రస్థాయిలో అనుభవం గడించాలని సీఎం కేసీఆర్ సర్వే ఏజెన్సీలకు వివరించారు.
ఈ పైలట్ సర్వే ద్వారా పూర్తిస్థాయి డిజిటల్ సర్వే నిమిత్తం విధివిధానాలు ఖరారు చేసుకోవాలని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా గ్రామాల్లో భూ వివాదాలు సమసిపోయాయని భావిస్తున్నాని, ఈ నేపథ్యంలో డిజిటల్ సర్వే 100 శాతం విజయవంతం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఇక, వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే పూర్తయిన తర్వాత, పట్టణ భూముల డిజిటల్ సర్వే చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.