- ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడాలనుకున్నానంటే ఫోన్లో బెదిరింపులు
- బెంగళూరు జట్టులోనే ఉండాలని కట్టడి చేశారని వివరణ
- నా కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు..
- తాజా ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ ఫేసర్ వెల్లడి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్ లో తాను ఢిల్లీకి ఆడాలని భావించినట్లు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులోనే కొనసాగాలంటూ ఐపీఎల్ బాస్ లలిత్ మోదీ బెదిరించారంటూ ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరు చాలా దూరమని, అక్కడి ఆహారం కూడా తనకు సరిపడదని వద్దనుకున్నట్లు వివరించారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడితే తరచుగా ఇంటికి వెళ్లి రావొచ్చని చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఐపీఎల్ కు చెందిన వ్యక్తి ఒకరు ఓ పేపర్ పై తన సంతకం తీసుకున్నారని ప్రవీణ్ చెప్పాడు. అయితే, అది కాంట్రాక్ట్ పేపర్ అనే విషయం అప్పుడు తనకు తెలియదన్నారు. తర్వాత లలిత్ మోదీ తనకు ఫోన్ చేశారని, బెంగళూరు జట్టుకు ఆడకుంటే ఐపీఎల్ లో తన కెరీర్ నాశనం చేస్తానని బెదిరించారని ప్రవీణ్ చెప్పారు. ఈమేరకు తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు.
క్రికెట్ లో బాల్ ట్యాంపరింగ్ చాలా సాధారణమని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. 1990 లలోనే ట్యాంపరింగ్ మొదలైందన్నాడు. రివర్స్ స్వింగ్ ను రాబట్టేందుకు దాదాపుగా ప్రతీ ఫాస్ట్ బౌలర్ ట్యాంపరింగ్ కు పాల్పడతాడని వివరించాడు. ఈ విషయం కూడా అందరికీ తెలుసని చెప్పాడు. అయితే, ఇప్పుడు మైదానం నలుమూలలా కెమెరాలు ఉండడం, మైదానంలోని ప్రతి ఆటగాడి చిన్న కదలికను కూడా రికార్డు చేస్తుండడంతో ట్యాంపరింగ్ ఆరోపణలు పెరిగాయని ప్రవీణ్ తెలిపాడు. అందరూ చేస్తున్నా పాకిస్థాన్ ఆటగాళ్లు ఇందులో ఆరితేరారని, వాళ్లే ఎక్కువగా ట్యాంపరింగ్ కు పాల్పడతారని తాను విన్నట్లు ప్రవీణ్ చెప్పుకొచ్చాడు.