కార్ రేస్ కు నిధుల విడుదల.. ఐఏఎస్ అధికారి అర్వింద్ కు మెమో
- ఫార్ములా – ఈ తో ఒప్పందంపై పలు ప్రశ్నలు
- కేబినెట్ అనుమతి లేకుండానే రూ.50 కోట్లు విడుదల
- నిధుల విడుదలపై హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ పై ఆరోపణలు
ఫార్ములా – ఈ రేసింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ కు మెమో జారీ చేసింది. కార్ రేసింగ్ కు సంబంధించి ఫార్ములా – ఈ తో కుదుర్చుకున్న ఒప్పందంపై వివరణ ఇవ్వాలని కోరింది. కంపెనీతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని కోరింది. అదేవిధంగా, కేబినెట్ ఆమోదం లేకుండానే రూ.54 కోట్ల నిధులు విడుదల చేయడాన్నీ ఇందులో ప్రశ్నించింది. బీహార్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ గత ప్రభుత్వంలో మున్సిపల్ , హెచ్ఎండీఏ కమిషనర్ గా పనిచేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా పేరుపొందారు.
తాజాగా ఆయనకు ప్రభుత్వం మెమో జారీ చేయడం సంచలనంగా మారింది. కాగా, ఫార్ములా రేస్ రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు నోటీసులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని ఫార్ములా – ఈ కంపెనీ ప్రశ్నించింది. మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు పంపుతామని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించింది. దీంతో ఫార్ములా – ఈ కంపెనీతో కుదిరిన ఒప్పందం, నిధులు విడుదల సహా పలు అక్రమాల వివరాలు బయటపడ్డాయి.
ఫార్ములా ఈ-రేస్‌తో మనకు ఎలాంటి ప్రయోజనం లేదు: మల్లు భట్టి విక్రమార్క
- ఫార్ములా ఈ-రేస్ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందన్న మల్లు భట్టి
- ప్రతి పైసా ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తామని స్పష్టీకరణ
- ఈ-రేస్ పేరుతో ఓ కంపెనీ టిక్కెట్లు అమ్ముకొని లబ్ధి పొందిందని విమర్శలు
ఫార్ములా ఈ-రేస్‌తో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఫార్ములా ఈ-రేస్‌పై మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఫార్ములా ఈ-రేస్ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఫార్ములా ఈ-రేస్‌కు అనుమతి లేదన్నారు. వాళ్లెవరో హైదరాబాద్‌కు వచ్చి… వెళ్లడానికి రూ.100 కోట్లు కట్టాలా? అని ప్రశ్నించారు. ఇది బిజినెస్ రూల్స్‌కు భిన్నమైనదన్నారు.
ప్రతి పైసా రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్‌పై మాజీ మంత్రులు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ-రేస్ విషయంలో తమ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని… ఈ-రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టమని విమర్శలు చేస్తున్నారని.. కానీ అది వెనక్కి వెళ్లడంలో మనకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ఓ కంపెనీ టిక్కెట్లు అమ్ముకొని లబ్ధి పొందిందని… ఇందులో ముగ్గురు వాటాదారులు ఉన్నారన్నారు.