Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

మాది అసలైన శివసేన కాకుంటే మాపై ఎందుకు అనర్హత వేటు వేయలేదు?: ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం

  • ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీయే అసలైన శివసేన అని ప్రకటించిన స్పీకర్
  • స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన ఉద్దవ్ ఠాక్రే
  • స్పీకర్ ప్రకటనపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్న ఉద్ధవ్ ఠాక్రే

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీయే అసలైన శివసేన అని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ చేసిన ప్రకటనపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. స్పీకర్ వ్యాఖ్యలను ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. సుప్రీం కోర్టు తీర్పును అవమానించడమేనని మండిపడ్డారు. గవర్నర్ తన బాధ్యతలను దుర్వినియోగం చేశారని… తప్పుడు నిర్ణయం ఇచ్చారని భారత అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టిందని గుర్తు చేశారు. ఇదంతా బీజేపీ కుట్రేనని ఆరోపించారు. ఎప్పటికైనా బాబా సాహెబ్ శివసేనను అంతం చేయాలనేదే వారి లక్ష్యం అన్నారు.

ఈ ఒక్క నిర్ణయంతో వారు అనుకున్న విధంగా శివసేన అంతం కాదన్నారు. స్పీకర్ ప్రకటనపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తమది అసలైన శివసేన కాకుంటే తమ ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదు? అని ప్రశ్నించారు. స్పీకర్ తనకు తాను సుప్రీం కోర్టు కంటే ఎక్కువగా భావించుకుంటున్నారని విమర్శించారు. అసలు స్పీకర్ నార్వేకర్ పార్టీలు మారిన వ్యక్తి అని ఆరోపించారు.

ఏం జరిగింది?

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శివసేనకు చెందిన రెండు వర్గాలు దాఖలు చేసిన అభ్యర్థనలపై స్పీకర్‌ బుధవారం తీర్పు ఇచ్చారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్‌ రాహుల్ నార్వేకర్ ప్రకటించారు. శివసేన నాయకుడిగా నియమితులైన ఏక్‌నాథ్ షిండేను తొలగించే అధికారం ఉద్ధవ్‌కు లేదని తేల్చి చెప్పారు. పార్టీలో విభేదాలు వచ్చిన సమయంలో షిండేకు మద్దతుగా 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. నిబంధనల ప్రకారమే ఆయన పార్టీ నాయకుడు అయినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను స్పీకర్ నార్వేకర్ తిరస్కరించారు.

స్పీకర్‌గా తాను సెక్షన్ 10 ప్రకారం అధికార పరిధిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. శివసేన 2018 సవరించిన రాజ్యాంగం.. భారత ఎన్నికల సంఘం రికార్డుల్లో లేనందున చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించలేమని స్పష్టం చేశారు. శివసేన 1999 రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకున్నామన్నారు. 2018లో శివసేనకు ఎన్నికలు కూడా నిర్వహించలేదని గుర్తు చేశారు. 2018 సంస్థాగత నాయకత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. షిండే వర్గానిదే అసలైన శివసేన అని ప్రకటించడంపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

త్వరలో వన్ నేషన్ వన్ ఎలక్షన్, యూనిఫామ్ సివిల్ కోడ్…ప్రధాని మోదీ

Ram Narayana

నా ఓటు ఆమ్ ఆద్మీ పార్టీకే: రాహుల్ గాంధీ..!

Ram Narayana

ఎగ్జిట్ పోల్ డిబేట్‌లకు కాంగ్రెస్ దూరం.. అమిత్ షా సెటైర్లు!

Ram Narayana

Leave a Comment