- తెలంగాణలో వలె ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుందని ప్రచారం
- ఉచిత బస్సు ప్రయాణ ప్రచారంపై స్పందించిన ఏపీఎస్ఆర్టీసీ
- ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టీకరణ
- ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి పథకం రాబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై నేడు ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఏ మేరకు భారం పడుతుంది? అని పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుంటే పది శాతం రాయితీ వస్తుందన్నారు. మరో నాలుగు నెలల్లో 1500 కొత్త లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు (బుధవారం) నుంచి డోర్ డెలివరీ, పికప్ లాజిస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. ఇక నుంచి లాజిస్టిక్ సేవలను ఆర్టీసీ ద్వారానే నిర్వహిస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ వెబ్ సైట్ ద్వారా తమను సంప్రదిస్తే డోర్ పికప్ చేసుకుంటామన్నారు. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్టుగా విజయవాడలో ప్రారంభించామని.. త్వరలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.