Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

వైసీపీ ఇన్చార్జిల మూడో జాబితా విడుదల… కేశినేని నానికి విజయవాడ బాధ్యతలు

  • వివిధ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చుతున్న వైసీపీ
  • ఇప్పటికే రెండు జాబితాలు విడుదల
  • నేడు మూడో జాబితాలో 6 ఎంపీ స్థానాలకు ఇన్చార్జిల నియామకం
  • 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్చార్జిల ప్రకటన

వైసీపీ అధినాయకత్వం రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఇన్చార్జిలను మార్చుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇన్చార్జిల మార్పుపై రెండు జాబితాలు విడుదల చేసిన వైసీపీ… నేడు మూడో జాబితా విడుదల చేసింది. నిన్ననే సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరడంపై ప్రకటన చేసిన ఎంపీ కేశినేని నానికి విజయవాడ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. 

కేశినేని నాని టీడీపీకి అధికారికంగా రాజీనామా చేసినట్టు ఇంకా నిర్ధారణ కాలేదు… పైగా ఆయన వైసీపీ కండువా కూడా కప్పుపుకోలేదు… అయినప్పటికీ వైసీపీ ఆయనను విజయవాడ ఇన్చార్జిగా ప్రకటించడం విశేషం.

మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. మంత్రి బొత్స సత్యనారాయణ అర్ధాంగి బొత్స ఝాన్సీని విశాఖ పార్లమెంటు ఇన్చార్జిగా ప్రకటించారు. విశాఖ స్థానం నుంచి బొత్స కుటుంబంలో ఒకరికి చాన్స్ ఇస్తారని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. ఇవాళ మూడో జాబితా వచ్చిన నేపథ్యంలో ఆ ప్రచారమే నిజమైంది. 

ఇక, తిరుపతి ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ సభ్యుడు గురుమూర్తికి మరోసారి లోక్ సభ అవకాశం లేనట్టేనని చెప్పాలి. తిరుపతి ఎంపీ స్థానం ఇన్చార్జిగా కోనేటి ఆదిమూలం పేరును జాబితాలో పేర్కొన్నారు. 

ఏలూరు ఎంపీ స్థానం ఇన్చార్జిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను నియమించారు. సునీల్ కుమార్ యాదవ్ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు తనయుడు. శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గం ఇన్చార్జిగా పేరాడ తిలక్ ను నియమించారు. 

ఇక, అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే… మూడో జాబితాలో పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మొండిచేయి చూపారు. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం కాగా, మూతిరేవుల సునీల్ కుమార్ ను ఇన్చార్జిగా పేర్కొన్నారు. ఎంఎస్ బాబు ఇటీవలే మీడియా ముందుకు వచ్చి తనకు ఈసారి టికెట్ వచ్చే అవకాశాల్లేవంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఇన్చార్జిలను మార్చుతున్నారంటూ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇక, మంత్రి జోగి రమేశ్ కు స్థాన చలనం కలిగింది. ఆయనను పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. ఆయన గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

కాగా, ఇవాళ మూడో జాబితాలో 6 ఎంపీ స్థానాలకు, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించారు.

Related posts

వైసీపీకి జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు గుడ్ బై టీడీపీలో చేరికకు రంగం సిద్ధం …!

Ram Narayana

అమ్మ అమెరికా ఎందుకు వెళ్లిందంటే..?: వైఎస్ షర్మిల

Ram Narayana

 ఇవాళ నేను పర్యటిస్తున్నానని తెలిసి జగన్ బయటికొచ్చారు: చంద్రబాబు

Ram Narayana

Leave a Comment