Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

భారత్-మాల్దీవుల దౌత్య వివాదంలో మరో ట్విస్ట్!

  • మార్చి 15లోగా సైనికులను ఉపసంహరించుకోవాలని డెడ్‌లైన్
  • గతంలోనే సైన్యం ఉపసంహరణను ప్రతిపాదించిన మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు
  • ఉపసంహరణపై ఇరు దేశాలు హైలెవెల్ కోర్ గ్రూప్ ఏర్పాటు
  • ఆదివారం మాలేలో తొలిసారిగా సమావేశమైన కోర్ గ్రూప్

ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలతో మొదలైన ఇరు దేశాల దౌత్య వివాదం మరో మలుపు తిరిగింది. మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని వెనక్కు పిలిపించుకోవాలని గతంలో భారత్‌కు సూచించిన అక్కడి ప్రభుత్వం తాజాగా మార్చి 15 లోపు సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డెడ్‌లైన్ కూడా విధించినట్టు తెలుస్తోంది. 

భారత్‌తో సంబంధాలను తగ్గించుకుంటామని హామీ ఇచ్చి మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన చైనా పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డెడ్‌లైన్ విధించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు. సముద్రయాన భద్రత, విపత్తు నిర్వహణలో మాల్దీవుల ప్రభుత్వానికి వారు సహాయసహకారాలు అందిస్తున్నారు. మునుపటి మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్ధన మేరకు భారత్ తన సైనిక సిబ్బందిని అక్కడకు పంపించింది. అయితే, గతేడాది జరిగిన ఎన్నికల్లో భారత్ అనుకూల ప్రభుత్వం గద్దెదిగి చైనా అనుకూల ముహమ్మద్ ముయిజ్జు అధికార పగ్గాలు చేపట్టారు. తాజాగా ఆయన భారత్‌ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించారు. ‘‘మాల్దీవుల్లో భారత సైన్యం ఉండటానికి వీల్లేదు. ఇది మా అధ్యక్షుడి విధానం’’ అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

సైన్యం ఉపసంహరణపై చర్చల కోసం ఇరు దేశాలు హైలెవెల్ కోర్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాయి. ఆదివారం మాలేలో తొలిసారిగా ఈ బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. 

ప్రధాని లక్షద్వీప పర్యటన తరువాత భారత్-మాల్దీవుల దౌత్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. లక్షద్వీప్ ప్రకృతి అందాలను కొందరు మాల్దీవులతో పోల్చారు. లక్షద్వీప్ త్వరలో పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడం ఖాయమన్నారు. ఈ నేపథ్యంలో కొందరు మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి చివరకు తమ పదవులు పోగొట్టుకున్నారు.

Related posts

కుప్పకూలిన జపాన్ ప్రభుత్వం- ప్రధాని రాజీనామా

Ram Narayana

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం… శిథిలాల తొలగింపుకే 15 ఏళ్లు పడుతుందట!

Ram Narayana

200 మంది ప్రయాణికులతో వెళ్తూ గ్రీన్‌లాండ్ మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయిన విలాసవంతమైన నౌక

Ram Narayana

Leave a Comment