Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

బెంగళూరులో డబుల్ ‘సూపర్’… చివరికి టీమిండియానే విన్నర్

  • బెంగళూరులో టీమిండియా, ఆఫ్ఘన్ మూడో టీ20
  • తొలుత స్కోర్లు సమం
  • మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ 
  • సూపర్ ఓవర్ లోనూ స్కోర్లు సమం
  • దాంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహణ… బిష్ణోయ్ మ్యాజిక్

బెంగళూరులో హోరాహోరీగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా 10 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ తొలుత టై కాగా, ఆ తర్వాత రెండు సార్లు సూపర్ ఓవర్ లోకి ప్రవేశించడం విశేషం. తొలి సూపర్ ఓవర్ లోనూ స్కోర్లు సమం కావడంతో, రెండో సూపర్ ఓవర్ నిర్వహించక తప్పలేదు. రెండో సూపర్ ఓవర్ లో టీమిండియా 11 పరుగులు చేయగా, ఆఫ్ఘనిస్థాన్ కేవలం 1 పరుగే చేసి ఓటమిపాలైంది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసి మ్యాజిక్ చేశాడు. 

ఈ మ్యాచ్ లో తొలుత టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘన్ జట్టు కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ లోకి మళ్లింది.

తొలి సూపర్ ఓవర్ సాగిందిలా…

ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ విసిరి 18 పరుగులు సమర్పించుకున్న ముఖేశ్ కుమార్ కు కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఓవర్ లో బంతిని అందించడం ఆశ్చర్యానికి గురిచేసింది. సూపర్ ఓవర్లో ముఖేశ్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొన్న ఆఫ్ఘన్ బ్యాటర్లు 1 వికెట్ కోల్పోయి 16 పరుగులు సాధించారు. అందులో ఒక సిక్స్, ఒక ఫోర్ ఉన్నాయి. 

ఇక, సూపర్ ఓవర్ లో టీమిండియా లక్ష్యం 17 పరుగులు కాగా… కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలో దిగారు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విశ్వరూపం ప్రదర్శించి భారీ సిక్సులు కొట్టాడు. చివరి రెండు బంతుల్లో టీమిండియా విజయానికి 3 పరుగులు అవసరం కాగా… ఐదో బంతికి సింగిల్ తీసిన రోహిత్ శర్మ… జైస్వాల్ కు స్ట్రయికింగ్ ఇచ్చాడు. 

అయితే ఆఖర్లో తాను వేగంగా పరిగెత్తలేనేమోనన్న అనుమానంతో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. దాంతో రింకూ బ్యాటింగ్ కు వచ్చాడు. ఇక, చివరి బంతికి 2 పరుగులు తీస్తే విజయం లభిస్తుందనగా, క్రీజులో ఉన్న జైస్వాల్ సింగిల్ కొట్టడంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. 

రెండో సూపర్ ఓవర్ ఇలా సాగింది…

రెండో సూపర్ ఓవర్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈసారి కెప్టెన్ రోహిత్ శర్మకు జతగా రింకూ సింగ్ బ్యాటింగ్ కు వచ్చాడు. రెండో సూపర్ ఓవర్లో తొలి బంతినే రోహిత్ శర్మ సిక్స్ గా మలిచాడు. రెండో బంతిని ఫోర్ కొట్టి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. మూడో బంతికి సింగిల్ తీసి రింకూకు స్ట్రయికింగ్ ఇచ్చాడు. కానీ రింకూ నాలుగో బంతిని భారీ షాట్ ఆడబోయి కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో సంజూ శాంసన్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఐదో బంతికి సింగిల్ తీసే యత్నంలో రోహిత్ రనౌట్ కావడంతో సూపర్ ఓవర్ లో టీమిండియా కథ ముగిసింది. రెండో సూపర్ ఓవర్లో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. 

ఇక, 12 పరుగుల లక్ష్యంతో రెండో సూపర్ ఓవర్లో బరిలో దిగిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు లెగ్ స్పిన్నర్ రవిబిష్ణోయ్ ధాటికి విలవిల్లాడింది. తొలి బంతికి నబీని అవుట్ చేసిన బిష్ణోయ్… మూడో బంతికి గుర్బాజ్ ను అవుట్ చేయడంతో ఆఫ్ఘన్ పోరాటానికి తెరపడింది. రెండో సూపర్ ఓవర్లో ఆఫ్ఘన్ జట్టు కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగింది. 

కాగా, ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా మూడు టీ20ల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

Related posts

సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ పగ్గాలు.. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌కు టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ

Ram Narayana

పుజారా, రహానే తమ కెరీర్ లను కాపాడుకోవడానికి మరొక్క ఇన్నింగ్సే మిగిలుంది: గవాస్కర్

Drukpadam

‘హరికేన్ బెరిల్’ ఎఫెక్ట్‌తో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమిండియా.. రంగంలోకి బీసీసీఐ!

Ram Narayana

Leave a Comment