ఎన్నికల ముందు బీజేపీ శ్రీరామ జపం …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని ధ్వజం …
కాంగ్రెస్ మిత్రులను కలుపుకొని పోవడంలో వైఫల్యం వల్లనే మూడు రాష్ట్రాల్లో ఓటమి
ఎన్నికల్లో ఓటమి భాదతో బి.ఆర్.ఎస్. తొందరపడుతుంది
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలు వమ్ముకానియరాదు
ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా కార్యాచరణ
పదేళ్ళపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ శ్రీరామజపం చేస్తున్నదని కొత్తగూడెం శాసనసభ్యులు, సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు . గడిచిన పదిహేను రోజులుగా రామజపం చేస్తూ ప్రజలను మోసపుచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని దేశ ప్రజలు ఎట్టిపరిస్థితులలోను బీజేపీకి అవకాశం ఇవ్వబోరని ఆయన అన్నారు . సిపిఐ ఖమ్మం జిల్లా సమితి సమావేశం గురువారం స్థానిక గిరిప్రసాద్భవన్లో శింగు నర్సింహారావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ దేశంలో ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి ఏ ఒక్క సానుకూలం నిర్ణయం తీసుకోని బీజేపీ మతాన్ని ఎరగా చూపి లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నదని, ఇప్పటికే లౌకిక వాదానికి తూట్లు పొడిచిందని బీజేపీ తీరుతో ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. హిందూమత ఫీఠాధిపతులు రామలయంలో రాముని ప్రతిష్టకు సంబంధించి భిన్న అభిప్రాయాలు వెలుబుచ్చినా ఎన్నికల నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని బీజేపీ తొందరపడుతుందన్నారు. బీజీపీ తర్వాత అతి పెద్ద పార్టీగా ఉండి ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ కలుపుకొని పోయే ధోరణిలో వ్యవహరించక పోతే మరోసారి నష్టం జరుగుతుందన్నారు. మూడు రాష్ట్రాలలో బీజేపీ పై వ్యతిరేకత ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలను ఐక్యం చేయడంలో కాంగ్రెస్ విఫలం చెందినందునే బీజేపీ గెలిచిందని కూనంనేని తెలిపారు. రాజస్థాన్లో సి.పి.ఎం.కు రెండు స్థానాలున్నప్పటికీ కలుపుకొని పోలేదని, ఛత్తీస్ ఘడ్ లో సి.పి.ఐతో పొత్తు లేకపోవడం కారణంగా కాంగ్రెస్ 15 స్థానాలలో ఓటమి చవిచూసిందని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా ప్రాంతీయ, జాతీయ పార్టీలకు తగు ప్రాతినిధ్యం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ వ్యహరిస్తే బీజేపీ ఓటమి తధ్యమన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల తరువాత ఓటమి చెందిన బి. ఆర్.ఎస్. తొందరపడుతుందని కూనంనేని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లు వేశారని కనీస సమయం ఇవ్వకుండా విమర్శించడం సరైన రాజకీయ వైఖరి కాదన్నారు. కాంగ్రెస్ పై ప్రజలు ఎన్నో ఆశలతో అధికారాన్ని అప్పగించారని, అందుకనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు పాలనా సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడంలో సరైన రీతిలో వ్యవహరించాలని కూనంనేని కోరారు. పార్టీ విస్తరణ, బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని ఆయన కోరారు. స్థానిక సంస్థలు పార్లమెంట్ ఎన్నికలు తదితర విషయాలలో పార్టీనిర్ణయాల కనుగుణంగా కార్యకర్తలు వ్యవహరించాలని ఆయన కోరారు. ఈసమావేశంలో సి.పి.ఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, సి.పి.ఐ రాష్ట్ర కంట్రోల్ కమీషన్ చైర్మెన్ మహ్మద్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.