Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

దేశంలోనే తొలి హెపటైటిస్-ఏ వైరస్ నిరోధక టీకా కనిపెట్టిన హైదరాబాదీ సంస్థ

  • హావీష్యూర్ పేరిట హెపటైటిస్-ఏ నిరోధక టీకాను ఆవిష్కరించిన ఐఐఎల్ 
  • ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇది అసలైన అర్థమన్న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
  • రెండు డోసులుగా టీకా తీసుకోవాలని వెల్లడి

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ తాజాగా హెపటైటిస్-ఏ వైరస్ నిరోధక టీకాను ఆవిష్కరించింది. దేశంలోని ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు అనుబంధ సంస్థ ఐఐఎల్.. హావీష్యూర్ పేరిట ఈ టీకాను తయారు చేసింది. శుక్రవారం నగరంలోని హయత్ ప్లేస్ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ టీకాను లాంచ్ చేశారు. ప్రజారోగ్యంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా సంస్థ అభివర్ణించింది. 

హెపటైటిస్- ఏ నిర్మూలనకు భారత్ చేస్తున్న పోరాటంలో హావీష్యూర్ ఓ కీలక ముందడుగని ఐఐఎల్ ఎండీ డాక్టర్ కే ఆనంద్ కుమార్ తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకా ఇదేనని చెప్పారు. తమ శాస్త్రవేత్తలు, పరిశోధకుల బృందం అంకితభావంతో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనాల ఫలితమే ఈ కొత్త తరం టీకా అని చెప్పుకొచ్చారు. 

కలుషిత ఆహారం, తాగు నీరు కారణంగా హెపటైటిస్ సోకుతోందని, ఇది తీవ్రమైన అంటువ్యాధి అని పరిశోధకులు తెలిపారు. నోరు, మలమార్గం ద్వారా ఇది సోకుతుందని వివరించారు. హెపటైటిస్ వ్యాధి కాలేయానికి సోకకుండా ఈ టీకా నివారిస్తుందని వివరించారు. 

‘‘ప్రస్తుతం హెపటైటిస్-ఏ టీకాను భారత్ దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో హావీష్యూర్ ఆవిష్కరణ దేశవైద్య రంగంలో కీలక ఘట్టం. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది నిజమైన అర్థం. 8 కేంద్రాలలో విస్తృతమైన క్లీనికల్ ట్రయల్స్ అనంతరం ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చాం. ఇది సురక్షితమైనది. హెపటైటిస్-ఏకు వ్యతిరేకంగా సమర్థంగా పనిచేస్తుందని నిరూపితమైంది’’ అని ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ చెప్పారు. 

హావీష్యూర్ టీకాను రెండు డోసులుగా తీసుకోవాలని డాక్టర్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఏడాది నిండిన చిన్నారులకు మొదటి డోసు.. ఆ తరువాత ఆరు నెలలకు రెండో డోసు ఇవ్వాలని తెలిపారు. కొత్త ప్రదేశాలకు వెళ్లేవారు, ముఖ్యంగా హెపటైటిస్ ఏ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేవారు కాలేయ సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారు ఈ టీకా తీసుకోవచ్చని చెప్పారు. 

డిమాండ్‌కు అనుగుణంగా హావీష్యూర్ ఉత్పత్తి చేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ఐఐఎల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డా ప్రియబ్రత పట్నాయక్ తెలిపారు. హెపటైటిస్- ఏ గురించి అవగాహన కల్పించడానికి టీకా ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు, కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తామని అన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ కర్పన్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు అజయ్ మిశ్రా, ఐఏఎస్ పాల్గొన్నారు.

Related posts

సోదాల పేరుతో మహిళలు ఉన్న గదుల్లోకి వెళ్ళడం తప్పు: ప్రియాంక గాంధీ!

Ram Narayana

కర్ణాటకలో సీఎం ఎంపికలో ఆలస్యం… పెరుగుతున్న ఆశావహుల సంఖ్య…

Drukpadam

భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన…

Ram Narayana

Leave a Comment