- రేపు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం
- జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు
- అప్రమత్తమైన భద్రతా దళాలు
రామాలయానికి ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో హైఅలర్ట్ నెలకొంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ గ్రూపు హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.
జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. దాదాపు 7 వేల మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా ఏటీఎస్ కమాండోలు, సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు దర్శనమిస్తున్నారు. అయోధ్యలో భద్రతను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ విభాగం పర్యవేక్షిస్తోంది. డ్రోన్లతో ముప్పును అరికట్టేందుకు డ్రోన్ జామర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో సైబర్ మోసగాళ్లు విజృంభిస్తున్నారు. భక్తుల విశ్వాసాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వాలంటూ నకిలీ క్యూఆర్ కోడ్ లను పంపుతున్నారు. మోసగాళ్లు పంపే సందేశాలకు స్పందించవద్దని, లింకులపై క్లిక్ చేయవద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
రేపు రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ… అయోధ్యకు భారీగా తరలివస్తున్న సాధువులు
అయోధ్యలో రేపు బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మహా సంరంభంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు అయోధ్యకు భారీగా తరలి వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న సాధువులతో అయోధ్య కిటకిటలాడుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తీర్థ క్షేత్రపురంలో సాధువులకు బస ఏర్పాటు చేశారు. రేపటి రామ మందిర ప్రారంభోత్సవంలో దాదాపు 4 వేల మంది సాధువులు పాల్గొంటారని అంచనా. ప్రస్తుతం అయోధ్య నగరంలో ఎక్కడ చూసినా అధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో నగరాన్ని అలంకరించారు. అందమైన ముగ్గులు, రామాయణ విశిష్టతను చాటే చిత్రాలతో అయోధ్య కనువిందు చేస్తోంది.