Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అయోధ్య వార్తలు

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూర్తి.. స్వామివారి సుందర రూపాన్ని వీక్షించండి!

  • అయోధ్యలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం
  • మధ్యాహ్నం 12.29 గంటలకు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
  • 84 సెకన్ల పాటు కొనసాగిన ప్రాణ ప్రతిష్ఠ క్రతువు

కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయింది. వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత గర్భగుడిలో ప్రధాని మోదీ స్వామి వారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. స్వామి వారికి తొలి హారతిని ఇచ్చారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. 

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రామజన్మభూమిపై హెలికాప్టర్లతో పూలను చల్లారు. మరోవైపు, రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన, అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ప్రసన్న వదనం, చిరు దరహాసం, స్వర్ణాభరణాలతో, ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాల రాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఈరోజు యావత్ దేశం రామ నామ స్మరణతో మారుమోగింది. 






అయోధ్య రామ మందిరంపై ఆర్మీ హెలికాప్టర్లతో పూల వాన!

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆలయంపై పూల వర్షం కురిపించనున్నారు. రాములోరికి హారతులు పట్టే సమయంలో ఆర్మీ హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేశారు. 

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా 30 మంది సంగీత కళాకారులు తమ ప్రతిభ చాటనున్నారు. హారతి సమయంలో అతిథులందరూ గంటలు మోగిస్తారు. 

ఈ చారిత్రాత్మక ఉత్సవంలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలు, ఆలయ ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని ప్రసంగిస్తారు. మొత్తం 121 మంది ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటూ ఆర్ఎస్ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి సమక్షంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది.

రామమందిర నిర్మాణ కార్మికులను సన్మానించిన ప్రధాని మోదీ…

  • బుట్టలో పూలు పట్టుకొని కార్మికులపై చల్లిన ప్రధాని మోదీ
  • వందల సంఖ్యలో ఉన్న కార్మికులను కుర్చీలలో కూర్చోబెట్టి అంతా తిరుగుతూ పూలు చల్లిన ప్రధాని
  • మధ్యాహ్నం జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించిన నరేంద్రమోదీ
PM Modi showers rose petals on the workers who built Ram Mandir

అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్మికులను ప్రధాని నరేంద్రమోదీ సన్మానించారు. కార్మికులపై పూలు చల్లి నమస్కారాలు చేశారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం నరేంద్రమోదీ కార్మికులకు సన్మానం చేశారు. వందల సంఖ్యలో ఉన్న కార్మికులను కుర్చీలలో కూర్చోబెట్టి ఓ బుట్టలో పూలు పట్టుకున్న మోదీ వారిపై చల్లుకుంటూ వెళ్లి గౌరవించారు. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కోట్లాదిమంది టీవీలలో.. ఆయా ప్రాంతాలలోని దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌ల ద్వారా చూశారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన సమయంలో కొత్తగా నిర్మితమైన అయోధ్య రామమందిరంపై ఆర్మీ హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి.

బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ అయోధ్య రామాలయ ప్రాంగణంలో జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మహత్కర ఘట్టంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి స్పందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్

  • ప్రస్తుతం ఈ భూమిపై తానే అత్యంత అదృష్టవంతుడినన్న శిల్పి
  • అంతా కల మాదిరిగా అనిపిస్తోందని వ్యాఖ్య
  • పూర్వీకులు, శ్రీరాముడి ఆశీర్వాదాలు ఎల్పప్పుడూ ఉంటాయని ఆనందం వ్యక్తం చేసిన అరుణ్ యోగిరాజ్
Sculptor Arun Yogiraj responded after the Lord Rama pran Prathista in Ayodhya

అయోధ్యలో అత్యంత వైభవోపేతంగా, కమనీయంగా జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువు తర్వాత విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తొలిసారి స్పందించారు. రాముడి విగ్రహాన్ని చెక్కిన తాను ప్రస్తుతం ఈ భూమిపై అత్యంత అదృష్టవంతుడినని భావిస్తున్నానని ఆయన అమితానందం వ్యక్తం చేశారు. ఇదంతా కల మాదిరిగా అనిపిస్తోందని అన్నారు. “నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, ఆ భగవంతుడు శ్రీరాముడి ఆశీర్వచనాలు నాకు ఎప్పటికీ ఉంటాయి. కొన్నిసార్లు నేను కలల ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది’’ అని యోగిరాజ్ అన్నారు. అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రామ్ లల్లా విగ్రహం కళ్లను కప్పి ఉంచిన వస్త్రాన్ని తొలగించిన అనంతరం శిల్పి అరుణ్ యోగిరాజ్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు.

కాగా కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ గతంలో ఎన్నో దేవాలయాల కోసం ఎన్నో విగ్రహాలను రూపొందించినప్పటికీ రామ్ లల్లా విగ్రహం కోసం యావత్ దేశం ఎదురుచూసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ వేయి కళ్లతో ఎదురుచూశారు. దీంతో ఇలాంటి అనుభూతి ఎప్పుడూ పొందలేదని యోగిరాజ్ చెప్పాడు. కాగా నల్లరాతితో యోగిరాజ్ రూపొందించిన ఈ 51 అంగుళాల విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. రామ్ లల్లా విగ్రహాన్ని గత వారమే ఆలయం గర్భ గుడిలో పెట్టినప్పటికీ ఈ రోజే పూర్తి రూపం దర్శనమిచ్చింది. కాగా  అరుణ్ యోగిరాజ్ తన కుటుంబంలో ఐదవ తరం శిల్పి కావడం విశేషం.

అయోధ్య బాలరాముడికి అత్యధిక విరాళం సమర్పించింది ఎవరో తెలుసా…?

  • అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నాడు సుప్రీంకోర్టు అనుమతి
  • రామ్ లల్లా కోసం వెల్లువెత్తిన విరాళాలు
  • 101 కేజీల బంగారం అందజేసిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్
  • ఆ బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ రూ.68 కోట్లు
Surat diamond trader donates 101 kg gold for Ram Lalla temple

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నాడు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, ఆలయ నిర్మాణం కోసం విరాళాలు వెల్లువెత్తాయి. అత్యధిక మొత్తంలో విరాళాలు ఇచ్చినవారిలో సూరత్ కు చెందిన దిలీప్ కుమార్ లాఖీ అగ్రస్థానంలో నిలుస్తారు. దిలీప్ కుమార్ ప్రముఖ వజ్రాల వ్యాపారి. ఆయనొక్కరే అయోధ్య ఆలయ నిర్మాణం కోసం 101 కిలోల బంగారం విరాళంగా ఇవ్వడం విశేషం. మార్కెట్ విలువ ప్రకారం ఈ బంగారం విలువ రూ.68 కోట్లు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందిన విరాళాల్లో అదే అత్యధికం! దిలీప్ కుమార్ అందించిన బంగారాన్ని బాల రాముని మందిరంలో గర్భగుడి, ఆలయ స్తంభాలు, తలుపులు, ఢమరు, త్రిశూలం వంటి నిర్మాణాల్లో ఉపయోగించారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వారిలో సూరత్ కు చెందిన దిలీప్ కుమార్ లాఖీ అనే వ్యక్తి మొదటిస్థానంలో ఉన్నారు. అతనొక ప్రముఖ వజ్రాల వ్యాపారి. ఆయనొక్కరే అయోధ్య ఆలయ నిర్మాణం కోసం 101 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు. కాగా.. ఈ బంగారం విలువ రూ.68 కోట్లు ఉంటుంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందిన విరాళాల్లో ఇదే ఎక్కువ. కాగా.. వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ అందించిన బంగారాన్ని బాల రాముని మందిరంలో గర్భగుడి, ఆలయ స్తంభాలు, తలుపులు, ఢమరు, త్రిశూలం వంటి నిర్మాణాల్లో ఉపయోగించారు. అంతేకాకుండా.. దేశవ్యాప్తంగా చాలా మంది భక్తులు చాలా విరాళాలు ఇచ్చారు. కాగా.. అందులో ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు కూడా ఉన్నారు. ఆయన రూ.11.3 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. అమెరికా, కెనడా, బ్రిటన్‌లలో ఉన్న ఆయన రామభక్త అనుచరులు రూ.8 కోట్లు విరాళంగా ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్‌ ఢోలాకియా రూ.11 కోట్లు విరాళమిచ్చారు. యూపీలో ఒక వ్యక్తి రామమందిరం కోసం రూ.కోటి ఇవ్వాలని నిర్ణయించుకుని అందుకుగాను 16 ఎకరాల పొలాన్ని అమ్మేశాడు. అప్పటికీ రూ. 15 లక్షలు తక్కువవడంతో అప్పుగా తీసుకొచ్చి రూ.కోటి జమ చేసి ఇచ్చాడు. దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమంలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారని విశ్వహిందూ పరిషత్‌ చెబుతుంది.

అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ వేడుకపై చిరంజీవి ఏమన్నారంటే…!

  • బాలరాముని ప్రాణప్రతిష్ఠ గొప్ప అనుభూతిని ఇచ్చిందన్న చిరంజీవి
  • దేశంలోని ప్రజలందరికీ మరిచిపోలేని రోజు అన్న మెగాస్టార్
  • శ్రీరాముడి విగ్రహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యానన్న వివేక్ ఒబెరాయ్
Chiranjeevi about their experience at Ayodhya Ram Mandir

అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇది దేశంలోని ప్రజలందరికీ ఓ మరిచిపోలేని రోజు అన్నారు. అయోధ్య రామమందిరానికి రావడం తనకు ఓ గొప్ప అనుభూతి అన్నారు.

శ్రీరాముడి విగ్రహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యాను: వివేక్ ఒబెరాయ్

శ్రీరాముడి విగ్రహాన్ని చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అన్నారు. బాలరాముడి విగ్రహం చాలా అందంగా ఉందన్నారు. విగ్రహాన్ని చూస్తే రాముడిని చూస్తున్న అనుభూతి కలుగుతోందన్నారు. ప్రతి కుటుంబానికి ఆయన ఆశీస్సులు కోరుకుంటున్నానన్నారు.

ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో నా కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి: పవన్ కల్యాణ్

Pawan Kalyan breaks down into tears at Ayodhya Ram Mandir

ఈ రోజు తాను భావోద్వేగానికి గురయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్ళు వచ్చినట్లు తెలిపారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింతగా పెంచిందన్నారు.

అయోధ్య రామమందిర తీర్థ ట్రస్ట్ దేశంలోని పలువురు ప్రముఖులకు ఈ కార్యక్రమం కోసం ఆహ్వానం పంపించింది. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు కార్యక్రమానికి హాజరయ్యారు. రామమందిరం ఎదుట జనసేనాని ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ ఫొటోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

అయోధ్యలో రామభక్తుడికి గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన వైమానిక దళం బృందం

  • ప్రాణప్రతిష్ఠ వేడుకలో గుండెపోటుకు గురైన ఓ రామభక్తుడికి సత్వర చికిత్స అందించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బృందం
  • ఎయిర్‌ఫోర్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సకాలంలో స్పందించడంతో నిలిచిన ప్రాణాలు
  • ఒక ప్రకటనలో వెల్లడించిన భారత వైమానిక దళం
Rama devotee had a heart attack in Ayodhya and Indian Air force saved his life

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ ఆలయ సముదాయంలో గుండెపోటుకు గురైన ఓ రామభక్తుడి ప్రాణాలను భారత వైమానిక దళం సిబ్బంది కాపాడారు. ఎయిర్‌ఫోర్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సకాలంలో స్పందించి వైద్యం అందించడంతో రామకృష్ణ శ్రీవాస్తవ (65) అనే భక్తుడి ప్రాణాలు దక్కాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన శ్రీవాస్తవ గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. 

ఈ విషయాన్ని గమనించిన వింగ్ కమాండర్ మనీష్ గుప్తా నేతృత్వంలోని భీష్మ్ క్యూబ్ బృందం తక్షణమే స్పందించి బాధితుడిని అక్కడే ఉన్న మొబైల్ ఆసుపత్రికి తరలించింది. అత్యంత కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో తీసుకెళ్లడంతో బాధితుడి ప్రాణాలను వైద్యులు కాపాడారు. ఒక గంట తర్వాత మెరుగైన వైద్యం కోసం అతడిని మరో ఆసుపత్రికి తరలించారు. అత్యంత కీలకమైన సమయంలో హాస్పిటల్‌కు తరలించడంతో రామకృష్ణ శ్రీవాస్తవ ప్రాణాలు నిలిచాయని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా గుండెపోటుకు గురైన సమయంలో శ్రీవాస్తవ బీపీ 210/170 ప్రమాదకర స్థాయికి చేరిందని, వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అతడికి ప్రాథమిక చికిత్స అందించిందని, రోగి పరిస్థితి నిలకడగా మారిన తర్వాత మెరుగైన చికిత్స కోసం సివిల్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. కాగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు వీలుగా 2 క్యూబ్-భీష్మ్ మొబైల్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ, వైద్య సంసిద్ధత కోసం ఈ బృందాలను ఏర్పాటు చేశారు.

Related posts

ప్రాణప్రతిష్ఠ తెల్లారి నుంచే మళ్లీ నిర్మాణ పనులు

Ram Narayana

తొలి రోజు అయోధ్య రామాలయం వద్ద భక్తజన సంద్రం.. కిక్కిరిసిపోయిన ప్రధాన ద్వారం..

Ram Narayana

రామ మందిరానికి ఉగ్రవాద బెదిరింపులు…. భద్రతా వలయంలో అయోధ్య

Ram Narayana

Leave a Comment